తెలంగాణాకు షాక్: పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్‌పై సుప్రీం సంచలన తీర్పు
పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. పోలవరం బనకచర్ల, నల్లమల సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఈ కీలక నీటిపారుదల వివాదంలో తెలంగాణకు తాత్కాలిక ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది.
తెలంగాణా తరపు వాదనలు ఇలా
తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఇక ఏపీ తరపున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఈ కేసును వాదించారు. తెలంగాణా తరపున వాదించిన న్యాయవాది పోలవరం ప్రాజెక్టును నల్లమల్ల సాగర్‌తో అనుసంధానం చేయడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముందని, గోదావరి నదికి సంబంధించిన నీటి కేటాయింపుల నిబంధనలు ఉల్లంఘించబడుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

వాదనలు విని కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం ధర్మాసనం
ఈ ప్రాజెక్ట్ అమలుతో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆయన వాదించారు. అయితే, అనుసంధానం వలన తెలంగాణాకు జరిగే నష్టం ఏమీ లేదని ఏపీ వాదించింది. దీంతో వాదనలు పూర్తిగా విన్న అనంతరం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలు కూడా సంబంధం కలిగి ఉన్నాయని పేర్కొంది.
విచారణపై సుప్రీం చెప్పిందిదే.. పిటీషన్ ఉపసంహరించుకున్న తెలంగాణా
ఈ అంశాన్ని ప్రస్తుత పిటిషన్ రూపంలో విచారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అంతర్రాష్ట్ర నీటి వివాదాలకు సంబంధించిన అంశాలను ఇతర చట్టబద్ధమైన మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.ప్రత్యామ్నాయంగా మీడియేషన్ లేదా సివిల్ సూట్ ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో, తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వీ తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు.
త్వరలోనే సివిల్ సూట్ దాఖలు చేస్తామన్న తెలంగాణా
ఈ అంశంపై త్వరలోనే సివిల్ సూట్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు.మొత్తంగా, పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ వివాదం మరో దశకు చేరింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ అంశం ఇక న్యాయపరంగా ఏ దిశలో సాగుతుందన్నది రాజకీయంగా, పరిపాలనా పరంగా ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications