32 లక్షల మంది విచారణకు ఎస్ 'సర్' అనటం లేదు!
తెలంగాణా రాష్ట్రంలో సర్ ప్రక్రియ నత్తకు నడకలు నేర్పిస్తుంది. రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించి ఓటర్ల వివరాలు సేకరించిన ఎన్నికల సంఘం ఇప్పుడు విచారణ ప్రక్రియ కొనసాగిస్తుంది. 2002 సర్ తో మ్యాపింగ్ కానివారు,అసాధారణంగా అనిపించిన అనుమానిత ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరారు.
నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరై అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించి ఓటరుగా నిరూపించుకోవాలి, అప్పుడే వారి ఓటు కొనసాగుతుంది. లేదంటే వారు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అయితే ప్రస్తుతం లక్షలాదిగా నోటీసులు జారీ అవుతున్నా ఓటర్లు విచారణకు హాజరు కాకపోవటం అధికారులకు తలనొప్పిగా మారింది. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విచారణ ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు.

రాష్ట్రవ్యాప్తంగా 47 లక్షల 79 వేల మందికి నోటీసులు జారీ కాగా, ఇప్పటి వరకు 32 లక్షల మంది నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు వెల్లడించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు బీఎల్‌వోలు ఓటర్లను నేరుగా కలిసి నోటీసులు అందజేసి అవగాహన కల్పించకపోవడమే ఈ నత్తనడకకు ప్రధాన కారణమని తెలుస్తోంది. చాలా చోట్ల ఫోన్ ద్వారా మాత్రమే సమాచారం ఇవ్వడం, ఇళ్లకు వెళ్లకపోవడం వంటి లోపాలు కనిపిస్తున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో నోటీసులు ఇవ్వకుండానే రికార్డుల్లో ఇచ్చినట్లు నమోదు చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. విచారణకు హాజరు కాని వారికి మరోసారి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 9 వేల మందికి రీ-షెడ్యూల్ నోటీసులు అందించారు. ఓటరు తుది జాబితాలో పేరు ఉండాలంటే నోటీసుకు తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలని, అవసరమైన పత్రాలు సమర్పించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటి వరకు 5 లక్షల 74 వేల మంది డాక్యుమెంట్లు సమర్పించగా, సుమారు 3 లక్షల మంది పేర్లను ఓకే చేశారు. కలెక్టర్ల స్థాయిలో రెండున్నర లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈసీ పేర్కొన్న 12 పత్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల కూడా చాలా మంది నిరాసక్తత చూపుతున్నారు. మరి ఈ ప్రక్రియలో ఈ సారి ఎంత మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారో అన్న ఆందోళన అన్ని పార్టీలలో వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications