మీద చేయిపడితే: తెరాసకు శోభారాణి హెచ్చరిక
హైదరాబాద్: ట్యాంక్‌బండ్ పైన ఉన్న మహనీయుల విగ్రహాల పైన చేయిపడితే ఊరుకునేది లేదని తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శి శోభారాణి సోమవారం హెచ్చరించారు. విగ్రహాలు తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం చేసే ప్రయత్నాలను తాము అడ్డుకుంటామన్నారు.
తెలంగాణ మహనీయులు, అమరవీరుల విగ్రహాలను స్థాపించుకోవడంలో ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. అందుకోసం ప్రస్తుతం ఉన్న విగ్రహాలు తొలగించాలనుకోవడం హేయమైన నిర్ణయమన్నారు. కేసీఆర్‌కు కలలో కూడా చంద్రబాబు, టీడీపీ, తామే గుర్తొస్తున్నామని, పరిపాలన పైన దృష్టి పెట్టకుండా కేసీఆర్ బాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

తెలుగు సంస్కృతిని కాపాడిన నన్నయ్య, మొల్ల, శ్రీశ్రీ, శ్రీకృష్ణదేవరాయలు తదితర ఎందరో మహానుభావుల విగ్రహాలు ఉన్నాయన్నారు. అలాంటి మహనీయుల విగ్రహాలను తొలగిస్తారా అని ప్రశ్నించారు. విగ్రహాలంటూ పదేపదే సెంటిమెంటు గురించి మాట్లాడవద్దన్నారు. వైయస్సార్ విగ్రహాలను తొలగించడంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉన్న రాజీవ్ గాంధీ పేరును ఎందుకు మార్చడం లేదన్నారు.
మరోవైపు, తెరాస పూర్తికాలం అధికారంలో ఉండదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, గండ్ర వెంకటరమణ రెడ్డి, అనీల్ అన్నారు. మూడేళ్లలోనే ప్రభుత్వం కూలిపోతుందన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ వచ్చిందని, సోనియా దయతో సీఎం అయిన కేసీఆర్, ఇప్పుడు తాను ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications