సచివాలయ సోలార్ కార్ పార్కింగ్ .. పనుల పూర్తికి డెడ్ లైన్ ఇదే!
తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం అయిన పీఎం సూర్య ఘర్ లో భాగంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవటాన్ని ప్రోత్సహిస్తోంది, అంతేకాదు మోడల్ సోలార్ విలేజ్ లను కూడా ఏర్పాటు చేసి, గ్రామం అంతా సోలార్ వ్యవస్థ ద్వారా విద్యుత్ పొందేలా చర్యలు తీసుకుంటుంది.
సచివాలయంలో పర్యావరణహిత ఇంధన వినియోగాన్ని పెంచే ప్లాన్
అటు ప్రజలను సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్న తెలంగాణా సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలలోనూ సోలార్ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ సచివాలయంలో పర్యావరణహిత ఇంధన వినియోగాన్ని పెంపొందించే దిశగా ముఖ్యమైన చర్యలు చేపడుతోంది. రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో ఉన్నతాధికారులతో ఈ మేరకు సమీక్ష సమావేశం నిర్వహించారు.

సోలార్ ప్యానెల్స్‌తో కూడిన షెడ్స్ ఏర్పాటు
ఈ సందర్భంగా సోలార్ కారు పార్కింగ్ వ్యవస్థ పనులను ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రూ.26.81 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో సోలార్ ప్యానెల్స్‌తో కూడిన షెడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తర భాగంలో రెండు వరుసలు, దక్షిణ భాగంలో మూడు వరుసలు, పశ్చిమ భాగంలో ఒక వరుసలో సోలార్ ప్యానెల్స్ అమర్చాలని మంత్రి సూచించారు.
సచివాలయానికి దాదాపు 90 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
ఈ వ్యవస్థ ద్వారా సచివాలయానికి అవసరమైన దాదాపు 90 వేల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని మంత్రి తెలిపారు. దీనివల్ల నెలవారీ విద్యుత్ బిల్లులో సుమారు 16 శాతం మేర ఆదా అవుతుందని తెలిపారు.అదే సమయంలో సీఆర్‌ఐఎఫ్ పనులు మరియు వంతెనల నిర్మాణ పురోగతిని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్షించారు.
సచివాలయంలో సోలార్ వ్యవస్థతో మరో కొత్త ముందడుగు
సేతుబంధన్ పథకం కింద రూ.76 కోట్ల వ్యయంతో చేపట్టిన నార్కెట్‌పల్లి వంతెన నిర్మాణంలో మరింత వేగం పెంచాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఈఎన్‌సీ లింగారెడ్డి, సీఈలు వసంత్ నాయక్, వనజతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు పనులను వేగవంతం చేస్తారని భావిస్తున్నారు. సోలార్ వ్యవస్థ పూర్తయితే సచివాలయంలో ఆధునిక ఇంధన నిర్వహణతో మరో కొత్త అడుగు వేసినట్టు అవుతుంది..













Click it and Unblock the Notifications