తెలంగాణ అవతరణ దినోత్సవాలకు సోనియా గాంధీ రాకపోవచ్చు: కారణం ఇదే
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వచ్చే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆరోగ్య సమస్యల వల్ల సోనియాగాంధీ రావటం లేదని నేతలకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే తీవ్రమైన ఎండల వల్ల సోనియాగాంధీ రాలేకపోవచ్చని పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. సోనియాగాంధీ ఒకవేళ వేడుకలకు రాకపోతే వీడియో ద్వారా సందేశాన్ని ప్రజలకు వెల్లడిస్తారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
తెలంగాణ ఏర్పడిన పదేళ్ల పూర్తికావడం, తొలిసారి అధికారంలోకి రావడంతో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్త చేసింది. ఈ క్రమంలో మే 28 ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని సోనియా గాంధీని ఆహ్వానించారు. అందుకు ఆమె సూత్రపాయంగా అంగీకరించారని స్వయంగా సీఎం తెలిపారు.

ఆ తర్వాత కూడా ఏఐసీసీ నుంచి సోనియాగాంధీ ఆవిర్భావ వేడుకలకు హాజరవుతారని పీసీసీ వర్గాలు తెలిపాయి. అయితే ఇంతలోనే మళ్లీ సోనియాగాంధీ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావడం లేదంటూ కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం. కాగా, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు విద్యావేత్తలను, ఉద్యమకారులను, రాజకీయ నేతలందరినీ కాంగ్రెస్ సర్కారు ఆహ్వానించింది.
జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాజధాని నగరాన్ని అత్యంత సుందరంగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. చార్మినార్, ట్యాంక్‌బండ్, సచివాలయం, అమరజ్యోతి స్థూపం, బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, గోల్కొండ వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో విద్యుత్ దీపాల కాంతులను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్‌పై ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ప్రత్యేక స్టాల్స్, కార్నివాల్ నిర్వహిస్తున్నారు. మరోవైపు, ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. అవతరణ దినోత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను, మళ్లింపులను విధించారు.












Click it and Unblock the Notifications