కేసీఆర్ మాటలను గుర్తు చేసి, సోనియా గాంధీతో చెప్పించి: సభలో ఆమె ఏం మాట్లాడుతారు?
హైదరాబాద్: యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ శుక్రవారం మేడ్చల్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం, అలాగే తెలంగాణ వచ్చాక ఓసారి తెరాస అధికారం అనుభవించిన తర్వాత ఆమె వస్తున్నారు. దీంతో ఆమె ఏం మాట్లాడుతారనే ఉత్కంఠ అందరిలోను నెలకొంది. తెలంగాణ ఇచ్చామని చెప్పడంతో పాటు ఈ నాలుగున్నరేళ్లలో కేసీఆర్ పాలన వైఫల్యాలను ఆమె ఎండగట్టే అవకాశముంది.
ఇదే విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు. రేపు సాయంత్రం ఐదు గంటలకు మేడ్చల్‌లో సోనియా సభ ఉందని, ప్రజలకు జరిగిన అన్యాయం, కేసీఆర్ వైఫల్యాలను ఈ సభలో వివరిస్తారని, రాబోయే తమ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలు చేస్తుందో కూడా చెబుతారని అన్నారు. ఈ సభలో సోనియా కంటే ముందు మిగతా నేతలు కేసీఆర్‌పై తీవ్రంగానే విమర్శించే అవకాశముంది.
Recommended Video


సోనియా చేతుల మీదుగా మేనిఫెస్టో
సోనియా సభ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు వేదికలపై 200 మంది ముఖ్య నేతలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఈ సభలో సోనియా గాంధీ 45 నిమిషాల పాటు మాట్లాడనున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ 20 నిమిషాలు మాట్లాడుతారు. సోనియా గాంధీ సభకు తెలంగాణ జన సమితి అధినేత కోదండరాంతో పాటు కాంగ్రెస్ కీలక నేతలు విజయశాంతి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్, జానా, మల్లుభట్టి తదితరులు రానున్నారు. సోనియా చేతుల మీదుగా 116 పేజీల కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

కేసీఆర్ మాటలను గుర్తు చేస్తారా?
భారీ బహిరంగ సభ నేపథ్యంలో సోనియా, రాహుల్ గాంధీ ప్రసంగాలపై కాంగ్రెస్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. తెలంగాణ సాకారం కావడానికి మేమే కారణమని అటు తెరాస, ఇటు కాంగ్రెస్ చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో పోటాపోటీగా చెబుతున్నాయి. సోనియా తెలంగాణ ఇచ్చిన దేవత అని కాంగ్రెస్ అంటే, తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చారని తెరాస చెబుతోంది. 2014లో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ సోనియా మద్దతు వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. దీనిని కాంగ్రెస్ నేతలు సభ వేదికగా గుర్తు చేసే అవకాశముంది.

సోనియా గాంధీతోనే చెప్పించడం కోసం
సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారని, అందుకే కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ వచ్చినా ఆ పార్టీ ఓడిందని కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నేతలకు మొట్టికాయలు కూడా వేసింది. ఇప్పుడు తెరాసకు అవకాశమివ్వకూడదని భావిస్తోంది. అందుకే సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని తాము చెప్పడంతో పాటు ఆమెతో చెప్పించే ఉద్దేశ్యంతో ఈ సభను ఏర్పాటు చేశారని అంటున్నారు.

కేసీఆర్‌ను కార్నర్ చేసే ప్రయత్నం
తెలంగాణ కల తన వల్లే సాకారమైందని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పైచేయి సాధిస్తున్న కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని సోనియా విమర్శలు గుప్పించే అవకాశముంది. తెలంగాణ ఏర్పాటుపై ఆమె ఏం మాట్లాడుతారు... అనే దానిపై కాంగ్రెస్, తెరాస నేతలతో పాటు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోనియాకు రావాల్సిన క్రెడిట్ కేసీఆర్ కొట్టేశారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సోనియా గాంధీతో స్వయంగా చెప్పించడం ద్వారా కేసీఆర్‌ను కార్నర్ చేయవచ్చునని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications