గుడ్‌న్యూస్: సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా భారతీయ రైల్వే నూతన రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందేభారత్ ను పట్టాలెక్కించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల మధ్య ఉన్న దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేలా వీటిని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు రెండు వందేభారత్ రైళ్లు, కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్ కు, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, విజయవాడ నుంచి చెన్నైకి ఐదు వందేభారత్ లు పరుగులు తీస్తున్నాయి.
సికింద్రాబాద్-పుణె మధ్య
వీటికి ప్రయాణికుల నుంచి రోజురోజుకు ఆదరణ దక్కుతుండటంతోనే ఇటీవలే సికింద్రాబాద్ నుంచి వైజాగ్ కు రెండో వందేభారత్ నడుపుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ నుంచి పూణె వరకు వందేభారత్ నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య శతాబ్ధి ఎక్స్ ప్రెస్ పరుగులు పెడుతోంది. దీనిస్థానంలో వందేభారత్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయమైంది. త్వరలోనే దీన్ని పట్టాలెక్కించబోతున్నారు. వందేభారత్ స్లీపర్ తొలి రైలును కూడా హైదరాబాద్ నుంచి ముంబయి మధ్య ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. దీనివల్ల తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలకు మరో వందేభారత్ అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.

నాలుగో అతి పెద్ద రైల్వేస్టేషన్ గా చర్లపల్లి
హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకు త్వరలోనే మరో రైల్వేస్టేషన్ అందుబాటులోకి రాబోతోంది. చర్లపల్లి స్టేషన్ ఆధునికీకరణ పనులు 98 శాతం పూర్తయ్యాయి. వీటికి సంబంధించిన ఫొటోలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దూర ప్రాంతానికి ప్రయాణించే ఎక్కువ రైళ్లను చర్లపల్లి నుంచి నడపబోతున్నారు. ఇక్కడి నుంచి నగరానికి చేరుకునేందుకు ప్రయాణికులకు అనుకూలంగా ఎంఎంటీఎస్ రైళ్లను కూడా చర్లపల్లి నుంచి తిప్పబోతున్నారు. వచ్చే నెలలో చర్లపల్లి రైల్వేస్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications