తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు: దేశంలో రుతుపవనాలతో సాధారణ వర్షపాతం, దక్షిణాదిలో తక్కవే
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారతదేశంలో నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. వర్షపాతం 1971-2020 కాలంలో 87 సెంటీమీటర్ల లాంగ్ పీరియడ్ యావరేజ్ (LPA)లో 96 శాతం నుంచి 104 శాతం వరకు ఉంటుందని పేర్కొంది.

దేశంలో రుతుపవనాలతో సాధారణం వర్షపాతం
అంతకుముందు, IMD 1961-2010 కాలంలో 88 సెం.మీల LPAని పరిగణించేది.
"నైరుతి రుతుపవనాల సీజన్‌లో 1971-2020 (కాలం) ఆధారంగా ఆల్-ఇండియా సాధారణ వర్షపాతం 868.6 మి.మీ. ఇది 1961-2010 నాటి సాధారణ 880.6 మి.మీని భర్తీ చేస్తుంది" అని తెలిపింది. ద్వీపకల్ప భారతదేశం ఉత్తర భాగం, మధ్య భారతదేశం, హిమాలయాల దిగువ ప్రాంతాలలో, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది.

దక్షణ భారతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం
ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాలు, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ ద్వీపకల్పంలోని దక్షిణ ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 2021లో, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశం "సాధారణ" వర్షపాతాన్ని పొందింది. దేశంలో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం ఇది వరుసగా మూడో సంవత్సరం. 2019, 2020లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.

తెలంగాణలో మూడురోజులపాటు వర్షాలు
ఇది ఇలావుండగా, తెలంగాణలో ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రాంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో గంటకు 30 నుంచి 40 కిలీమీటర్ల వేగంతో గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే కురసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఎండవేడిమి, ఉక్కపోత నుంచి రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది.












Click it and Unblock the Notifications