పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!
పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులకు బిగ్ అప్డేట్. పరీక్షా ఫలితాల వెల్లడి పైన స్పష్టత వస్తోంది. ప్రస్తుతం పరీక్షల మూల్యాంకనం మొదలైంది. కాగా, స్పాట్ వాల్యూయేషన్‌లో ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు చుక్కలు చూపిస్తున్నాయి. సాంకేతిక సమస్యలతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో.. రోజుకు 40 పేపర్లు దిద్దాల్సిన టీచర్లు 20 పత్రాలకు పరిమితం అవుతున్నారు. కాగా.. ఫలితాల వెల్లడి పైన అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి స్థాయిలో సిద్దమైన తరువాతనే ఫలితాలు వెల్లడించనున్నారు.
పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ వేళ సాంకేతిక లోపం, నెట్ వర్క్ పనిచేయకపోవడం, సర్వర్ డౌన్, ట్యాబ్‌లు సజావుగా పనిచేయకపోవడం వంటి సాంకేతిక కారణాలతో మార్కుల నమోదులో తీవ్ర జాప్యం నెలకొంది. విధుల్లో పాల్గొనే టీచర్లు ఒక్కోక్కరు కనీసం 40 జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ప్రతి జవాబు పత్రాన్ని స్కానింగ్ చేసి, మార్కులు నమోదు చేయాలి. అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్లు మూల్యాంకనం చేసిన అనంతరం మార్కులను ట్యాబ్‌ల ప్రక్రియకు ప్రత్యేకంగా కేటాయించిన స్పెషల్ అసిస్టెంట్లు మాత్రమే నమోదు చేయాలి. వాల్యూయే షన్ సెంటర్లలో అందుబాటులో ఉంచిన ట్యాబ్‌లు, ఇంటర్నెట్ పనిచేయడం లేదని టీచర్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు జరిగాయి. దాదాపు 6.20 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఏప్రిల్ 16లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మే మొదటి వారంలో ఫలితాల వెల్లడి
కాగా, మూల్యాంకనం విధులకు దాదాపు 20 వేల మందిని ఆటోమేషన్ ద్వారా నియమించారు. అయితే విద్యాశాఖ నుంచి చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్ విధులు కేటాయించినా కొందరు ఎగ్జామినర్లు డుమ్మాకొడుతున్నారు. స్పాట్‌లో టీచర్ల కొరత తీవ్రతరం కావడం విద్యాశాఖ స్పందించింది. స్పాట్ విధులకు హాజరుకాని టీచర్లపై సస్పెన్షన్ వేటు తప్పదని అధికారులు హెచ్చరించారు. స్పాట్ సెంటర్‌లలో ఏర్పడిన సాంకేతిక సమస్యను టెలికం అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. తొలుత ఏప్రిల్ 4వ వారంలో ఫలితాలు వెల్లడించాలని భావించినప్పటికీ మే మొదటి వారంలో పదో తరగతి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వచ్చే వారం ఫలితాల తేదీ పైన స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications