ఆ లిస్ట్ లో ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు.. తొలిసారి జియో ఫెన్సింగ్..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ఫోకస్ పెట్టింది. హామీ ఇచ్చినట్లుగానే ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఫ్రీ బస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా అమలు చేయగా.. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. జనవరి 21న ఈ పథకం ప్రారంభం అయింది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ స్కీం కోసం దరఖాస్తులు భారీగా వచ్చాయి. దీంతో వచ్చిన అప్లికేషన్స్ ను మూడు భాగాలుగా చేశారు అధికారులు. సొంత స్థలం ఉండి ఇళ్లు లేనివాళ్లను ఎల్ 1 కేటగిరి, సొంత స్థలం లేనివారిని ఎల్-2, సొంత ఇల్లు ఉండీ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్-3 కేటగిరీలో చేర్చారు.
మొదటి ప్రాధాన్యం వారికే..
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా.. మొదటి దశలో సొంత స్థలం ఉండి ఇళ్లు లేని వాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించిన రోజే ప్రకటించింది. ఈమేరకు ఇటీవల సర్వే చేసిన అధికారులు సొంత స్థలం ఉన్న నిరుపేదలతో కూడిన ఎల్1 జాబితాను సిద్ధం చేశారు. ఇళ్లు కట్టే స్థలాన్ని సర్వే సమయంలోనే చూపించారు. ఇప్పుడా స్థలం జియో ఫెన్సింగ్ చేయనున్నారు. ఆ స్థలంలోనే ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయాల్సి ఉంటుంది.ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసే రోజు గ్రామ కార్యదర్శికి, వార్డు అధికారికి సమాచారం ఇవ్వాలి.

ఎల్ 2 కేటగిరీలో 19 లక్షల మంది..
ఎల్ 2 కేటగిరిలో 19 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వీరికి ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం కూడా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అర్హత ఉన్న వారి పేర్లను గుర్తించారు. ఇక లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది.
తొలిసారి జియో ఫెన్సింగ్..
ఇందిరమ్మ ఇళ్లను తొలిసారి జియో ఫెన్సింగ్ చేయనున్నారు. దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లలో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. దీంతో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చింది రేవంత్ సర్కార్. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున మంజూరు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications