వామనరావు దంపతుల హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదుల దారుణ హత్య ఘటనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఈ కేసుకు సంబంధించిన వీడియోలు సహా అన్ని పత్రాలు తమ ముందుంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
రికార్డులను పరిశీలించి సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో రికార్డులను అందజేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ తర్వాత విచారణను సుప్రీంకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది.

న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని మృతుడు వామనరావు తండ్రి ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న అంశంపై అభిప్రాయం తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఈ క్రమంలో గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కొద్దిరోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై న్యాయస్థానమే నిర్ణయం తీసుకోవాలని గతంలో ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసుకు సంబంధించిన వీడియోలు సహా అన్ని వివరాలు తమ ముందుంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
2021లో న్యాయవాద దంపతుల హత్య
కాగా, 2021 ఫిబ్రవరి 17వ తేదీన కారులో కోర్టుకు వెళుతున్న న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణిలను పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద నడిరోడ్డుపై కొంతమంది దుండుగులు కిరాతకంగా మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. ఈ దారుణ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ హత్య కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications