చిక్కుల్లో పడ్డ రాజా సింగ్: శోభాయాత్రలో గాడ్సే ఫొటో: రెచ్చగొట్టే ప్రసంగం
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి చెందిన గోషామహల్ శాసన సభ్యుడు టీ రాజా సింగ్ మరోసారి వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. గతంలో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. అప్పట్లో హైదరాబాద్‌లో పలు పోలీస్ స్టేషన్లల్లో కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదు కావడంతో రాజా సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం. ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి వివాదాలే ఆయనను చుట్టుముట్టాయి.
మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో..
స్టాండప్ కమేడియన్ మునావర్ ఫారూఖీ నిర్వహించ తలపెట్టిన ప్రదర్శనకు వ్యతిరేకంగా రాజా సింగ్ గతంలో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత అరెస్ట్ అయ్యారు. కొద్దికాలం పాటు జైలు జీవితాన్ని గడిపారు. ఈ కేసుల నేపథ్యంలో- బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రాజా సింగ్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు.
రామనవమి శోభాయాత్రలో..
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లో పెద్ద ఎత్తున శోభాయాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే. భాగ్యనగర్ ఉత్సవ సమితి దీన్ని నిర్వహించింది. పాతబస్తీలోని మంగళ్ హట్ లోని సీతారాంబాగ్ ఆలయం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామ శాల వరకు ఈ శోభా యాత్ర కొనసాగింది. వేలాది మంది భక్తులు ఇందులో పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో హైదరాబాద్ మారుమోగింది. బాణాసంచా కాల్చుతూ పండగ వాతావరణాన్ని సృష్టించారు.

మళ్లీ రాజా సింగ్ వివాదం..
ఈ శోభాయాత్రలో రాజా సింగ్ పాల్గొన్న విషయం తెలిసిందే. వందలాది మంది అనుచరులు, అభిమానులతో ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజా సింగ్ అనుచరులు బైక్‌పై తిరుగుతూ సందడి చేశారు. ఆ సమయంలో నాథూరామ్ గాడ్సే చిత్రపటాన్ని ప్రదర్శించడం సరికొత్త వివాదాలను సృష్టించింది. ఇది అక్కడితో ఆగలేదు. శోభాయాత్ర కొనసాగుతున్న సమయంలో ఒకట్రెండు చోట్లు రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బాప్ తో బాప్ రహేగా..
బాప్ తో బాప్ రహేగా.. అంటూ రాజా సింగ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. వివాదాలకు కారణం అయ్యాయి. ఒక వర్గాన్ని కించపరిచేలా ఈ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం కాస్తా పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. కొందరు స్థానికులు రాజా సింగ్ పై అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విధ్వేషపూరిత ప్రసంగాలు చేశారనే కారణంతో రాజా సింగ్‌పై ఐపీసీలోని 153-ఏ, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు.












Click it and Unblock the Notifications