బాబుని ఇరికించడం సులువుకాదు? టీడీపీ డైలమా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారంలో తెలంగాణలో అధికార తెరాస, ఏపీలో విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తదితర పార్టీల పరంగా జరుగుతున్న పరిణామాలను టీడీపీ నిశితంగా గమనిస్తోంది. జగన్‌ను ముందు పెట్టి తెరాస పావులు కదుపుతోందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ భావిస్తోంది.
ఏదో విషయానికి లింకు పెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మరో రాష్ట్రం కేసు నమోదు చేయాలని చూడటం అంత తేలిక కాదని కూడా అంటున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా చంద్రబాబుకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్, తెరాస మధ్య దోస్తీ కుదిరిందని అంటున్నారు.
రాష్ట్ర విభజన అంశంలో తెరాస, వైసీపీ భిన్న వైఖరులు తీసుకున్నప్పటికీ వీలైనంత వరకూ పరస్పర విమర్శలు చేసుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో జగనే గెలవబోతున్నారంటూ ఎన్నికల ఫలితాల ముందు కేసీఆర్ జోస్యం చెప్పారు.

ఆ తర్వాత వైసీపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు తెరాసలో చేరారు. దీనిని కూడా వైసీపీ సీరియస్‌గా తీసుకోలేదు. ఫిరాయింపులపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తెరాసపై ఎంత విరుచుకుపడుతున్నా, వైసీపీ మాత్రం మౌనం వహిస్తూ వచ్చింది.
తెలంగాణలో రెండు రోజుల కిందట జరిగిన ఎమ్మెల్సీల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే వైసీపీ ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకతే ఈ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ కూడా అదే విషయం స్పష్టంగా చెప్పడం గమనార్హం. చంద్రబాబు లక్ష్యంగా తెరాసకు మద్దతు పలికినట్లు చెప్పారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్యూ ద్వారా కేసీఆర్, జగన్ కలిసి.. చంద్రబాబును కూడా లక్ష్యంగా చేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రతివ్యూహానికి సిద్ధమవుతోన్న టీడీపీ, ఏం చేయాలనే విషయమై తర్జన భర్జన పడుతున్నట్లుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications