టెక్కీ భార్య బలవన్మరణం: హత్యనా, సూసైడ్ నోట్‌పైనా అనుమానాలు
హైదరాబాద్: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భార్య ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయి రెండేళ్లు గడవక ముందే ఆమె నిండు ప్రాణాలను తీసుకుంది. అయితే, భర్తనే ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన హైదరాబాదులోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
సీఐ రమేష్ కోత్వాల్ కథనం ప్రకారం - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం పట్టణానికి చెందిన మన్మథరావు కూతురు అనూష(26)కు అదే రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన పల్నాల కోటేశ్వర్‌రావు కుమారుడు పి.యశ్వంత్ కుమార్‌తో నిరుడు మే నెలలో వివాహం జరిగింది.
వారు మియాపూర్ ప్రగతి ఎన్‌క్లేవ్‌లోని గృహలక్ష్మీ ఎవెన్యూ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. యశ్వంత్ ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా అనూష గృహిణిగా ఉంటోంది. ఎప్పటిలాగే ఆఫీస్‌కు వెళ్లిన యశ్వంత్ రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి రాగా బెడ్‌రూంలో అనూష చీరతో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

తనకు పెళ్లి ఇష్టంలేకున్నా పెద్దల ఒత్తిడితో చేసుకున్నానని, బ్రతకడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఈ విషయాలు యథార్థమని రాసి ఉన్న సూసైడ్ నోట్ ఆమె పక్కనే దొరికింది. దీంతో యశ్వంత్ ఆమె తరఫు బంధువులకు సమాచారం అందించాడు.
అనూష ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. పెళ్లయిన ఐదు రోజుల నుంచే తమ కూతురిని యశ్వంత్ వేధించేవాడని అనూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతడే తన కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించారు. ఈ మేరకు అనూష తండ్రి మన్మథరావు మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యశ్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ వైద్యశాలకు తరలించారు. సూసైడ్ నోటు తన కూతురు రాసింది కాదని మన్మథరావు అంటున్నారు.
అయితే, భార్యాభర్తల మధ్య విభేదాలున్నట్లు తెలుస్తోంది. భర్త అనుమానాలపై, వేధింపులపై అనూష గతంలో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. పెద్ద మనుషుల సమక్షంలో భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చి కలిసి ఉండాలని చెప్పారు.












Click it and Unblock the Notifications