Telangana: మరికొద్ది గంటల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, తొలి ఫలితం అక్కడ్నుంచే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్న క్రమంలో ఇప్పటి వరకు నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లతో లెక్కింపు ప్రారంభంకానుండగా, అరగంట తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించిన 2417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఒక్కో నియోజకవర్గానికి 14 నుంచి 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 5 గంటలకే పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటారు. 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. పోస్టల్ బ్యాలెట్ల ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. 8.30 తర్వాత ఎనిమిదిన్నరకు ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. తొలి రౌండ్ నుంచే ఓటరు నాడి తెలిసే అవకాశమున్నప్పటికీ.. రౌండ్లు పూర్తయ్యే నాటికి మరింత ఉత్కంఠ రేపేలా ఉంటాయని తెలుస్తోంది. మొత్తం 2417 రౌండ్లలో ఫలితాలు తేలనున్నాయి.

అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 26 రౌండ్లలో లెక్కింపు చేపట్టనుండగా.. అత్యల్పంగా భద్రాచలంలో కేవలం 13 రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కోసం 119 నియోజకవర్గాల్లో 1798 టేబుళ్లు ఏర్పాటు చేశారు. గరిష్టంగా మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో లెక్కింపు కోసం 28 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే.. ఈవీఎంలోని ఓట్లతో పాటు సమాంతరంగా లెక్కిస్తారు. చివరి రౌండ్ మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైతేనే చేపడతారు. మొత్తం లెక్కింపు పూర్తయ్యాక ఐదు వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను ర్యాండమ్‌గా లెక్కిస్తారు. ఆ తర్వాతే ఫలితాన్ని ప్రకటిస్తారు. మొత్తంగా రాష్ట్రంలో 71.34 ఓటింగ్ శాతం నమోదైన విషయం తెలిసిందే. నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధికంగా మునుగోడులో 91.89 శాతం పోలింగ్ జరగ్గా.. అత్యల్పంగా యాకుత్ పురాలో కేవలం 39.64 శాతం ఓటర్లు మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు.
భద్రాలచలం నుంచే తొలి ఫలితం?
భద్రాచలం నియోజకవర్గంలో 1,17,447 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 14 టేబుళ్లు ఏర్పాటు చేసి 13 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నారు. రాష్ట్రంలో అత్యంత తక్కువ రౌండ్లలో లెక్కింపు పూర్తయ్యేది భద్రాచలంలోనే కావడం గమనార్హం. మధ్యాహ్నం 12 గంటల్లోపు లెక్కింపు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో భద్రాచలం నియోజకవర్గం ఫలితం తొలుత వెలువడుతుందని భావిస్తున్నారు. మరోవైపు, చార్మినార్ నియోజకవర్గం కూడా తక్కవ రౌండ్లలోనే కౌంటింగ్ పూర్తి కానుంది. దీంతో ఈ నియోజకవర్గం ఫలితం కూడా త్వరగానే రానుంది.
ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 2290 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, వీరిలో 2068 మంది పురుషులు, 221 మంది మహిళలు ఉన్నారు. ఇక, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. బీఆర్ఎస్ మొత్తం 119 స్థానాల్లో పోటీలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థులు 118 చోట్ల బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు 111 స్థానాల్లో పోటీలో నిలవగా, మిత్రపక్షం జనసేన(Janasena Party) ఎనిమిది స్థానాల్లో పోటీ చేసింది. సీపీఎం 19, సీపీఐ ఒక స్థానంలో, బీఎస్పీ నుంచి 108 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండగా.. అసలైన ఫలితాలు ఎలా ఉండనున్నాయో కాసేపట్లో తెలియనున్నాయి.












Click it and Unblock the Notifications