తెలంగాణలో పోలింగ్ వేళ.. కార్లల్లో భారీగా నగదు పట్టివేత
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది.
పోలింగ్‌ను సజావుగా కొనసాగించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఓటర్లు అధికారాన్ని ఎవరికి కట్టబెట్టారనేది తేలిది అప్పుడే.

పోలింగ్ సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారీగా నగదు వెలుగు చూస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో కోట్ల రూపాయల మేర నగదు, మద్యం బాటిళ్లను ఎన్నికల సిబ్బంది, టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి బ్రేకులు పడట్లేదు. ప్రచారం ముగిసిన తరువాత కూడా పెద్ద ఎత్తున నగదు లభిస్తోంది.
తాజాగా- హైదరాబాద్ శివార్లల్లో 1.68 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తెల్లవారు జామున ఖాజాగూడ వద్ద మాదాపూర్, రాయదుర్గం స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తోండగా.. అక్రమంగా తరలిస్తోన్న ఈ నగదు వెలుగులోకి వచ్చింది.
ఈ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ 11 ఏపీ 2098 రిజిస్ట్రేషన్ గల కారుతో పాటు మరో వాహనాన్ని సీజ్ చేశారు. అందులో ప్రయాణిస్తోన్న వారిపై కేసు నమోదు చేశారు. ఈ నగదుకు సంబంధించిన ఎలాంటి రసీదు కూడా వారి వద్ద లేదని పోలీసులు నిర్ధారించారు.












Click it and Unblock the Notifications