తెలంగాణ ఎన్నికల పై బిగ్ అప్డేట్ - షెడ్యూల్ అప్పుడేనా..!?
తెలంగాణ ఎన్నికల సమరానికి సమయం సమీపిస్తోంది. కేంద్రంలో మారుతున్న సమీకరణాలతో రాష్ట్రంలో ఎన్నికలపైన కొంత కాలంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఢిల్లీ నుంచి ఇప్పుడు స్పష్టత వస్తోంది. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ముహూర్తం పైన స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే తేదీలపైన క్లారిటీ వస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్:తెలంగాణ ఎన్నికల నిర్వహణ పై కీలక సమాచారం అందుతోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగటం ఖాయమైందని సమాచారం. తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు అక్టోబరు 6న షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 2018లో.. డిసెంబరు 7న ఎన్నికలు జరిగాయి.

జనవరి 16న శాసనసభ తొలి సమావేశం జరిగింది. దీన్ని బట్టి.. 2024 జనవరి 17లోపు కొత్త శాసనసభ కొలువుదీరాలి. అందుకు అనుగుణంగా ఈ ఏడాది అక్టోబరు మొదటి వారంలో షెడ్యూల్ విడుదలయ్యేలా కసరత్తు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ సైతం అక్టోబరు 10లోపు షెడ్యూల్ విడుదలవ్వాలి. అంతకు మించి ఆలస్యం జరిగితే.. ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతాయనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ సమయంలోనే రాష్ట్రంలో కేంద్ర ఎ్నికల సంఘం పర్యటనకు ముహూర్తం ఖరారైంది.
రాష్ట్రానికి కేంద్ర టీంలు:రాష్ట్రానికి రానున్న కేంద్రం ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది, పోలీసు బందోబస్తు వంటి పలు అంశాలను పరిశీలించనుంది. ఈ పరిశీలన పూర్తయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేక నివేదికను సమర్పించనుంది.
ఆ నివేదిక అందిన వెంటనే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అక్టోబరు 6న ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఆ తేదీన కుదరకపోతే.. అక్టోబరు 10వ తేదీలోపు షెడ్యూల్‌ను జారీ చేస్తారని అంచనా. షెడ్యూల్ జారీ అయిన నెల తర్వాత నోటిఫికేషన్‌ను విడుదల అవుతుంది. ఆ తర్వాత.. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైన నెల రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ముగించాల్సి ఉంటుంది.

డిసెంబర్ లో పోలింగ్..!:తెలంగాణలో ఈ నెల 18 వరకు కొత్త ఓటర్ల నమోదుకు 13.06లక్షల దరఖాస్తులు, పేర్ల తొలగింపునకు 6.26 లక్షల అర్జీలు అందాయి. సవరణలకోసం 7.77 లక్షల దరఖాస్తులు అందినట్లు ఎన్నికల విభాగం అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇప్పటి వరకు అందిన దరఖాస్తులను ఈనెల 27 లోపు పరిష్కరించి.. అక్టోబరు 4న తుది జాబితాను విడుదల చేస్తారు. గడువు ముగిసినప్పటికీ.. పౌరులు ఎప్పుడైనా దరఖాస్తులు పంపే వెసులుబాటు ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం వెల్లడించింది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలకు కనీసం రెండు నెలల సమయం అవసరం. దీంతో, అందుతున్న సమాచారం మేరకు డిసెంబర్ తొలి వారంలోనే పోలింగ్..కౌంటింగ్ ఉండే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications