తెలంగాణలో ఇక వాడివాడిగా.. నోటిఫికేషన్ జారీ!!
తెలంగాణ శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు ఈ నెల 29వ తేదీన ఆరంభం కానున్నాయి. వీటి కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశారు. 29న ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య కొనసాగుతున్న తీవ్ర ఘర్షణ నేపథ్యంలో ఈ సమావేశాలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
డిసెంబర్ 30 నుంచి నూతన సంవత్సర దినోత్సవం వరకు మూడు రోజుల సెలవుల అనంతరం మళ్లీ జనవరి 2న సభ తిరిగి ప్రారంభమవుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. గత బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి దక్కాల్సిన నదీ జలాల వాటాను సాధించడంలో విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తోన్న నేపథ్యంలో.. ఈ విషయం సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. దీనిపై ప్రత్యేక చర్చకు జరగొచ్చు.

కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు రాజీపడిందని, దీంతో సాగునీటి భవిష్యత్తుకు దీర్ఘకాల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే విమర్శించిన విషయం తెలిసిందే. కృష్ణా నదిపై ఒక్క భారీ ప్రాజెక్టునూ దశాబ్ద కాలంలో పూర్తి చేయకపోవడం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణ, ఆర్థిక సమస్యలపై బీఆర్‌ఎస్ నిర్లక్ష్యాన్ని వివరిస్తూ ఓ నోట్ సైతం ఇవ్వాలని జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు కూడా.
కొడంగల్‌లో నూతన సర్పంచుల సమావేశంలో ఈ విషయాన్నీ ప్రస్తావించారాయన. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. పదేళ్లపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోకపోవడం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. పాలమూరు ప్రాంతం సాగునీటికి నోచుకోని పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ నాయకులు విపరీతమైన వ్యక్తిగత సంపద పోగు చేసుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా సభలో చర్చకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయంపైనా ఆరోపణలు- ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. దీనిపై అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు రేవంత్. బీఆర్‌ఎస్ పాలనలో తన భర్త ఫోన్ ట్యాపింగ్‌కు గురయ్యారని స్వయంగా కల్వకుంట్ల కవిత చేసిన ప్రకటనలను దీనికి ఉదాహరణ. ఈ అంశంపై బీఆర్‌ఎస్ నేతల మౌనం తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications