23 నుంచి తెలంగాణ అసెంబ్లీ: సంక్షేమానికి రూ.వేల కోట్లు: బీఆర్ఎస్ బలం ఎంత?
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖాయమైంది. ఈ నెల 23వ తేదీన అసెంబ్లీ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సభ ఆరంభమౌతుంది. ఈ మేరకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీ సమావేశం కావడం ఇది మూడోసారి.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 24వ తేదీన సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అలాగే- ధరణి పోర్టల్‌కు సంబంధించిన వివాదాస్పద భూ సమస్యలను పరిష్కరించడంలో భాగంగా కొన్ని కీలక కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయడానికి అవసరమైన కేటాయింపులు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో ఈ హామీల అమలుకు రూ.53,916 కోట్ల రూపాయలను కేటాయించింది. పూర్తి బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని 75,000 కోట్ల రూపాయలకు పెంచవచ్చని తెలుస్తోంది.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లోఉచిత ప్రయాణం, ప్రతి నెలా 2,500 రూపాయల ఆర్థిక సహాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు చేయూత, వరి పంటకు సంవత్సరానికి 500 రూపాయల బోనస్ చెల్లింపు, గృహజ్యోతి కింద ఇంటింటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీలకు భారీగా నిధులను కేటాయిస్తారని చెబుతున్నారు.
అదే సమయంలో రాజకీయంగా కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు అత్యంత కీలకమైనవి. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి చేరిన తరువాత ఆరంభమౌతోన్న బడ్జెట్ సమావేశాలు కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ 39 సీట్లు కాగా.. సాంకేతికంగా అది 29కి తగ్గింది.












Click it and Unblock the Notifications