బండి సంజయ్ అవుట్..?!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఈ ఏడాది చివరి నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. ఎన్నికలకు సమాయాత్తం కావాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖలో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి.
పార్టీలో అసంతృప్తి పతాకస్థాయికి చేరింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో రాజకీయ పరిణామాలన్నీ బీజేపీకి ప్రతికూలంగా పరిణమించినట్లు భావిస్తోన్నారు ఆ పార్టీ సీనియర్ నాయకులు. ఇది కాస్తా పార్టీ అధిష్ఠానాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. కొందరు కీలక నేతలు సైతం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తేలిన నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం జోక్యం చేసుకుంది.

ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుంది. వారిద్దరూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వైఖరిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సొంత నిర్ణయాలతో బండి సంజయ్ తెలంగాణలో పార్టీని దిగజార్చుతున్నట్లు ఫిర్యాదు చేశారని సమాచారం.
బండి సంజయ్‌ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించి సీనియర్లకు అవకాశం ఇవ్వాల్సిన అవకాశాలను పరిశీలించాలని సూచించినట్లు తెలుస్తోంది. వారు చేసిన సూచనలపై బీజేపీ అధిష్ఠానం కాస్త గట్టిగానే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. పార్టీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించే అవకాశాలను పరిశీలిస్తోన్నట్లు చెబుతున్నారు.
ఆయన స్థానంలో కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డిని అపాయింట్ చేయొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం హవా నడుస్తోన్న నేపథ్యంలో- దానికి చెక్ పెట్టేలా కిషన్ రెడ్డికి తెలంగాణ పార్టీ పగ్గాలను అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారాన్ని బీజేపీ ఇన్‌ఛార్జ్ తరుణ్ ఛుగ్ తోసిపుచ్చినప్పటికీ ఆగట్లేదు.

కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి.. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం, ఆయన స్థానంలో బీసీ సామాజిక వర్గానిక చెందిన బండి సంజయ్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలనే ప్రతిపాదనలపై బీజేపీ అధిష్ఠానం కసరత్తు సాగిస్తోంది. రెండో ఆప్షన్‌గా పార్టీ ఓబీసీ మోర్చా చీఫ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.
గతంలో రెండుసార్లు పార్టీ పగ్గాలను అందుకున్న అనుభవం కిషన్ రెడ్డికి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2010 నుంచి 2014 వరకు అధ్యక్షుడిగా పని చేశారు. విభజన తరువాత కూడా అంటే 2016 వరకు ఆయనే కొనసాగారు. పార్టీ నేతలందరితో కిషన్ రెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఫలితంగా అందరినీ ఏకతాటిపైకి నడిపిస్తారని అధిష్టానం భావిస్తోంది.
బండి సంజయ్‌కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని పార్టీ హైకమాండ్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. కిషన్ రెడ్డిని పూర్తి కాలం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలా లేక లేక పార్టీ అధ్యక్షుడిగా అదనపు బాధ్యతలతో కేంద్ర మంత్రిగా కొనసాగాలా? అనే విషయంపైనా మల్లగుల్లాలు పడుతోంది. కాగా- ఇంత తక్కువ వ్యవధిలో పార్టీని సన్నద్ధం చేయడం చాలా కష్టమౌతుందని కిషన్ రెడ్డి భావిస్తున్నారని చెబుతున్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదనే వాదనలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications