తెలంగాణలోని అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
రాష్ట్రంలోని అర్చకులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలోని అర్చకులు, ఉద్యోగుల చిరకాల కోరికను నెరవేర్చారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. అర్చక, ఉద్యోగులకు గ్రాట్యుటీ రూ. 4 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అర్చక సంక్షేమ నిధి పోస్టర్ ను రిలీజ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాయాలయాల్లో పని చేస్తున్న అర్చకుల చిరకాల కోరికను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీర్చారు. అన్ని ఆలయాల్లో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్న అర్చక, ఉద్యోగ సంక్షేమ నిమిత్తం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎండోమెంటు ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ వెంకటరావు తదితర అధికారులతో అర్చక, ఉద్యోగ సంక్షేమ నిధి పోస్టరును రిలీజ్ చేశారు.
"అర్చక, ఉద్యోగుల కోసం తమ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వివరించారు. ఈ సంక్షేమ ట్రస్టు ద్వారా దేవాదాయ శాఖ పరిధిలో గల సహాయ కమీషనర్ స్థాయి వరకు గల దేవాలయాలలో పని చేసే సుమారు 13,700 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. అర్చకులు, ఇతర ఉద్యోగులకు మరణానంతరం లేదా రిటైర్మెంట్ గ్రాట్యూటీ ఇవ్వడం జరుగుతుంది. ధూపదీప నైవేద్య అర్చకులకు మరణానంతరం చెల్లించు గ్రాట్యూటి నిర్ధారించాం. మరణానంతరం చెల్లించు ఎక్స్ గ్రేషియా, అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తము చెల్లింపు ఈ నిధి ఉపయోగపడుతుంది" అని మంత్రి కొండా సురేఖ తెలిపారు.
ఈ నిధి కింద ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్ మెంట్, వివాహ నిమిత్త పథకం, ఉపనయన పథకం, గృహ నిర్మాణ, కొనుగోలు మరియు మరమ్మత్తుల నిమిత్త పథకం, విద్యా పథకం, విధులు నిర్వహించలేని వికలాంగులైన ఉద్యోగులకు ఆర్థిక సహాయ పథకం అందజేయడం జరుగుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు.

తాజా నిర్ణయాలతో రెగ్యులర్ అర్చకులు, ఇతర ఉద్యోగులకు మరణానంతరం లేదా రిటైర్మెంట్ గ్రాట్యుటీ పథకానికి 28.05.2025 రోజున అర్చక సంక్షేమ బోర్డు వారు గతంలో చెల్లించిన గ్రాట్యుటీ రూ 4 లక్షల నుండి రూ 8 లక్షలకు పెంచినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ గ్రాట్యుటీ మొత్తం సదరు ఉద్యోగి యొక్క బ్యాంకు ఖాతాలో ఏక మొత్తంలో వారి సర్వీసు కాలానికి లోబడి చెల్లిస్తామన్నారు.
ఎవరైనా అకాలంగా చనిపోతే, అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం రూ20,000 ల నుంచి రూ 30,000/- లకు పెంచినట్టు చెప్పారు. కాగా, ఈ అంశానికి సంబంధించి ప్రాంతీయ, జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు అర్చక, ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తారని మంత్రి వివరించారు. ఈ నిర్ణయంతో అర్చకులు, దేవాదాయ శాఖ ఉద్యోగులకు పెద్ద ఎత్తున లబ్ది జరుగుతుందని మంత్రి కొండా సురేఖ ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications