తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు కొత్త వ్యవసాయ కళాశాలలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉన్న జయశంకర్ యూనివర్సిటీకి అనుబంధంగా మూడు కొత్త వ్యవసాయ కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్టోబర్ 16 గురువారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ మినహా మిగిలిన మంత్రులందరూ హాజరయ్యారు.
తెలంగాణ కేబినెట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో మూడు కొత్త వ్యవసాయ కళాశాలలను నిర్మించాలని నిర్ణయించింది. జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఈ మూడు వ్యవసాయ కళాశాలలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రులంతా ఏకాభిప్రాయం తెలిపారు. ఈ కాలేజీలను కొడంగల్, హుజుర్ నగర్, నిజాామాబాద్ లో నిర్మించాలని అభిప్రాయానికి వచ్చింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు, సీఎస్ రామకృష్ణారావు, ఇతర ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఇక 42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంపుపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపిన విషయం తెలిసిందే. తదుపరి కార్యాచరణపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రూ. 10 వేల కోట్లతో 5,566 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల ప్రాజెక్ట్ కు కేబినెట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. అంతేకాక శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కూడా తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరోవైపు.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతపెద్ద మొత్తంలో వరి దిగుబడి రాలేదని.. రికార్డుస్థాయిలో ఈసారి వరిసాగు అయింది.. కేంద్రం సహకరించినా, లేకపోయినా ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తాం. మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కేబినెట్ మీటింగ్ అనంతరం ఆయన మీడియాకు వివరాలను అందించారు. "లోకల్ ఎన్నికల్లో పోటీకి ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ నిర్ణయం. మెట్రో సెకండ్ ఫేజ్‌పై కమిటీ ఏర్పాటు చేస్తాం" అని మంత్రి పొంగులేటి అన్నారు. అలాగే ప్రజాపాలన ఉత్సవాల కోసం కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications