తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు - ఆట మొదలు..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు. రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయం గా పై చేయి సాధించే ప్రయత్నం చేస్తోంది. రేవంత్ వ్యూహాలను బీజేపీ, బీఆర్ఎస్ కౌంటర్ చేసేలా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటు ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం మంత్రివర్గ భేటీ జరగనుంది. బీసీ రిజర్వేషన్లతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల పైన నిర్ణయం జరగనుంది. ఇక, వీటి ద్వారా రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.
కీలక నిర్ణయాలు
తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సంతాప తీర్మానాల తరువాత వాయిదా వేస్తారు. తర్వాత శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) భేటీ కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలన్నదానికి సంబంధించిన అజెండాను ఖరారు చేయనున్నారు. అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ఇతర విధానపరమైన అంశాలపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన విచారణ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.

రిజర్వేషన్లు - ఎన్నికలు
అయితే... ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లపై ఉన్న 50శాతం పరిమితిని ఎత్తివేస్తూ ఆర్డినెన్సు తీసుకొచ్చిన సర్కారు.. ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపింది. దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారు. బీసీలకు ప్రస్తుతం 23 శాతంగా ఉన్న రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచి, స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 69 శాతం మేరకు అమలు చేస్తూ సవరణ బిల్లును అసెంబ్లీలో చర్చకు పెట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే.. అన్ని పార్టీలూ అనుకూలంగానే ఉన్న నేపథ్యంలో శాసనసభలో ఆమోదం లభిస్తుందని, వెంటనే బిల్లు ఆధారంగా ఉత్తర్వులు జారీ చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆలోచనలో ఉంది.
వ్యూహాత్మకంగా
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై ఏర్పాటైన మంత్రుల కమిటీ.. రాజ్యాంగ, న్యాయ నిపుణులను సంప్రదించినప్పుడు చట్ట పరంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తే ఇదే మెరుగైన ప్రత్యామ్నాయమనే అభిప్రాయం వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తుది తీర్పు కోసం వేచి చూడడం, పార్టీల పరంగా 42 శాతం రిజర్వేషన్ ప్రకటించి ఎన్నికలకు వెళ్లడం అన్న ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చట్ట సవరణతో జీవో ఇవ్వడం ద్వారా ముందుకు వెళ్లాలని నిర్ణయిస్తే పది రోజుల్లో పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల కమిషన్‌కు సమర్పించనుంది. మొత్తం 40 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగించాలని భావిస్తున్నారు. దీంతో.. ఈ రోజు జరిగే సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications