తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం.. సర్పంచ్ ఆశావహులకు గుడ్ న్యూస్ !
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులకు ఇప్పటివరకు అమల్లో ఉన్న "ఇద్దరు పిల్లల నిబంధన"ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ, పరిపాలనా రంగాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. అందులో ప్రధానంగా, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం, మూడు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయరాదు. ఇప్పుడు ఈ పరిమితిని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డినెన్స్ ద్వారా ఈ సవరణలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే కొత్త ఆర్డినెన్స్ జారీ అయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే ఈ చట్ట సవరణ దస్త్రంపై సంతకం చేశారు. ఆ ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేసి మంత్రివర్గానికి సమర్పించగా, అది ఇప్పుడు ఆమోదం పొందింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో గతంలో జరిగిన సవరణలను తెలంగాణ అధికారులు పరిశీలించారు. ఆ అనుభవం ఆధారంగా Telangana Panchayat Raj Actలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నిబంధన వల్ల చాలా మంది అర్హులైన అభ్యర్థులు పోటీ చేయలేకపోయారని పలు రాజకీయ వర్గాలు అభిప్రాయపడ్డాయి. దీనిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను విస్తరించాలనే ఉద్దేశ్యంతో ఈ పరిమితిని తొలగించింది. ఈ నిర్ణయంతో భవిష్యత్తులో గ్రామ, మండల, జిల్లా పంచాయతీలతో పాటు పురపాలక సంస్థల ఎన్నికల్లో కూడా అభ్యర్థులు ఇకపై పిల్లల సంఖ్య ఆధారంగా అనర్హతకు గురి కావడం జరగదు.
అలానే కేబినెట్ సమావేశంలో ఎస్‌ఎల్‌బీసీ (సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కాలువ) టన్నెల్ పునరుద్ధరణపై.. సుదీర్ఘంగా చర్చించి, దీన్ని వేగవంతంగా పూర్తి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్ట్ పునరుద్ధరణకు సంబంధించిన సాంకేతిక వివరాలు, నిధుల కేటాయింపు అంశాలు కూడా చర్చలో ప్రస్తావనకు వచ్చాయి.












Click it and Unblock the Notifications