telangana cabinet telangana rashtra samithi k chandrasekhar rao kt rama rao harish rao sankranti pragathi bhavan టీఆర్ఎస్ తెలంగాణ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ డేట్ ఫిక్స్..! అదే ముహూర్తానికి మంత్రులుగా ప్రమాణం..!!

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ పై నెలకొన్న ఉత్కంఠ మరో రెండు వారాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండగ వెళ్లిన ఒకటి రెండు రోజులు తర్వాత మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు ఐనట్టు తెలుస్తోంది. ఐతే ఆశావహుల్లో మాత్రం నరాలు తెగిపోయే సస్పెన్స్ మాత్రం రోజురోజుకు రెట్టింపవుతున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు కోసం ఎవరి ప్రత్నాలు వారు చేసుకొంటుండగా, మరికొందరు యువరాజు కేటీఆర్ ను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. మరో రెండు వారాల్లో ఎవరు పైలట్ వాహనం వెనక సచివాలయానికి చేరుకుంటారో అన్న అంశం తేలిపోనుందనే చర్చ జరుగుతోంది.

తెలంగాణ మంత్రివర్గానికి కుదిరిన ముహూర్తం..! అదే రోజు కొలువు తీరనున్న మంత్రివర్గం ..!!
కేవలం ఒక్క మంత్రిని నియమించుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తన మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ పార్టీ నేతలు చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. గత మంత్రివర్గంలో ఉన్నవారిలో ఎవరు ఉంటారో ఎవరు ఊడుతారో తెలియని పరిస్థితుల్లో వారూ నిరీక్షిస్తుండగా కొత్తగా మంత్రి పదవులు కోరుకుంటున్నవారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ తన మంత్రివర్గాన్ని సంక్రాంతి తరువాత 18వ తేదీన విస్తరిస్తారన్న ప్రచారం ఒకటి టీఆర్ఎస్‌లో జరుగుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికలముందే విస్తరణ..!ఉత్కంఠ లో ఆశావహులు..!!
పంచాయితీరాజ్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం మంత్రివర్గ విస్తరణ, శాసనసభ సమావేశాలు నిర్వహించరాదన్న రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటన, పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాలపై ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు, పంచాయితీరాజ్ శాఖ అధికారులు గురువారం ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల నియమావళిని అధ్యయనం చేశారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణకు, అసెంబ్లి సమావేశాలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఏమాత్రం అడ్డంకి రాదని తేల్చినట్టు తెలుస్తోంది.

ఎన్నికల కోడ్ అడ్డంకి కాదు..! సంక్రాంతి తర్వాత విస్తరణకు ఏర్పాట్లు..!!
దీంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పడైనా ఉండొచ్చని అధికారులు తేల్చారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి సంబంధించి శాసనసభ సమావేశాలను ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చని దీనికి ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని అధికారులు స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్ళారని అందుకు వారు కూడా సీఎం కార్యాలయ వాదనను ఏకీభవించినట్టు తెలుస్తోంది.

మంత్రుల శాఖలపై ప్రగతి భవన్ లో కసరత్తు..! ఎవరికి అవకాశాలు అనే అంశంపై చర్చ..!!
సీఎం చంద్రశేఖర్ రావు ముందుగా నిర్ణయించినట్టు సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. తనతో పాటు మంత్రిగా మహమూద్ అలీని మంత్రివర్గంలో చేర్చుకున్న కేసీఆర్ వారం, పది రోజుల్లో మరికొంత మందితో మంత్రివర్గాన్ని విస్తరిస్తారని సంకేతాలిచ్చారు. జనవరి 16 వరకు మంచి రోజులు ఉన్నాయని, 18వ తేదీన మంచి ముహూర్తం ఉందని తెలియడంతో ఆ రోజున మంత్రివర్గాన్ని విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలకు మరింత పదును పెంచినట్టు తెలుస్తోంది.