బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో పలు కీలక అంశాలపై చర్చించడంతో పాటు, పంచాయతీ రాజ్ చట్టంలో సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ భేటిలో తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన వెల్లడించారు. రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇవాళ్టితో కలిపి 19 క్యాబినెట్ భేటీలు నిర్వహించామని.. ఇప్పటి వరకు జరిగిన భేటీల్లో 321 అంశాలను మంత్రివర్గం ఆమోదించిందని వివరించారు.

అంతే కాకుండా గత మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించిన అంశాల అమలుపై సమీక్ష నిర్వహించామన్నారు. ప్రతిష్ఠాత్మక అమిటీ, సెంటినరీ రిహాబిలిటేషన్ విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా ఇచ్చేందుకు ఆమోదం తెలిపామని మంత్రి తెలిపారు. ఈ వర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో కులగణను విజయవంతంగా పూర్తిచేశాం అని పొంగులేటి చెప్పారు.
అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 17వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందన్నారు. మార్చిలోపు లక్ష ఉద్యోగాలు ఇచ్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయించామని తెలిపారు.
మరోవైపు తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో త్వరితగతిన రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి, నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications