చేయూత పెన్షన్లు అప్లై చేసుకునేవారికి శుభవార్త.. కీలక వెసులుబాటు!
తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్త సామాజిక పింఛన్ల విషయంలో మరో శుభావార్త చెప్పింది. కొత్త సామాజిక పించన్ల దరఖాస్తుల విషయంలో ముఖ్యమైన స్పష్టీకరణ ఇచ్చింది. దరఖాస్తు చేసేటప్పుడు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు వెంటనే అందుబాటులో లేకపోయినా సరే ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ తెలిపింది. అయితే దరఖాస్తులను పరిశీలించే సమయంలో మాత్రం సంబంధిత ధ్రువపత్రాలను తప్పనిసరిగా సమర్పించాలని సూచించింది.
అర్హులైన వ్యక్తులు సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం
ఈ నిర్ణయం వల్ల చాలామంది అర్హులైన వ్యక్తులు సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది. గీత కార్మికుల విషయంలో ఆబ్కారీ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ ధ్రువీకరణ పత్రం లేకపోయినా ఆధార్ కార్డు, రేషన్ కార్డుతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఒంటరి మహిళలకు తహసీల్దారు ధ్రువపత్రం, దివ్యాంగులకు సదరం లేదా యూడీఐడీ, చేనేత కార్మికులకు సంబంధిత శాఖ సహాయ డైరెక్టర్ ధ్రువీకరణ పత్రం అవసరం.

సెప్టెంబర్ 15వరకు చేయూత పించన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ పత్రాలు దరఖాస్తు సమయంలో లేకపోయినా సమస్య లేదు. కానీ ఎంపిక ప్రక్రియలో వాటిని సమర్పించకపోతే దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం ఉంది. గతంలో పింఛను పొందినా ఏదైనా కారణంతో నిలిపివేయబడిన వారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. చేయూత పింఛన్ల దరఖాస్తులకు మొదట జూలై 31వరకు గడువు ఉంది.
అయితే చాలా మంది ఇంకా దరఖాస్తు చేయలేదని గమనించి ప్రభుత్వం సెప్టెంబర్ 15వరకు గడువును పొడిగించింది.
ఆగస్టు 9 నుంచి ఐదు కేటగిరీల్లో దరఖాస్తుల స్వీకరణ
ఆగస్టు 9 నుంచి ఐదు కేటగిరీల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలు, నగరాల్లో బిల్ కలెక్టర్లు క్షేత్రస్థాయి పరిశీలన చేసి అర్హులను ఎంపిక చేస్తారు.ఆగస్టు 30 వరకు ఇప్పటికే 4.34 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో వితంతువుల నుంచి మాత్రమే 2.64 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గడువు పొడిగింపు వల్ల మరో 50 వేలకు పైగా దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
కొత్తగా 2.50 లక్షల మందికి చేయూత పింఛన్లు మంజూరు చేయాలని లక్ష్యం
రాష్ట్రప్రభుత్వం కొత్తగా 2.50 లక్షల మందికి చేయూత పింఛన్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయాలు అర్హులైన పేదలకు, ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు పెద్ద ఉపశమనం కలిగిస్తాయి. ధ్రువపత్రాలు సమయానికి సిద్ధం కాకపోయినా ముందుగా దరఖాస్తు చేసుకుని తర్వాత పత్రాలు సమర్పించే అవకాశం ఉండటం వల్ల అనేక మంది ప్రయోజనం పొందగలుగుతారు. అర్హులైనవారు సెప్టెంబర్ 15లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications