బాగా దెబ్బతిన్న బ్యాలెన్స్ షీట్: 50,000 మందిపై వేటు: టాప్ కార్ మేకర్ బోర్డు ఏకగ్రీవ ఆమోదం
ప్రముఖ జర్మన్ కార్ల తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ ఊహించని రీతిలో భారీ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ ఆటోమొబైల్ రంగంలో తీవ్ర పోటీని తట్టుకోవడానికి, ఉత్పత్తి వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవడానికి దాదాపు 50,000 మంది ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించింది. దీంతో పాటు తాము ఉత్పత్తి చేసే వాహనాల మోడళ్లను కూడా సగానికి తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది.
దీనిపై రూపొందించిన ఫ్యూచర్ ప్లాన్ 2030 ని ఫోక్స్‌వ్యాగన్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. గతంలో ప్రకటించిన కోతలకు అదనంగా మరో 50,000 ఉద్యోగాలను తొలగించనుందీ టాప్ ఆటోమేర్. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో మొత్తం ఉద్యోగాల తొలగింపు లక్షకు చేరుతుంది. పెరుగుతున్న నష్టాలను అరికట్టడానికి 2035 నాటికి తమ వాహన పోర్ట్‌ఫోలియోను సగానికి పరిమితం చేయాలని కూడా యాజమాన్యం ఈ ఫ్యూచర్ ప్లాన్ లో ప్రతిపాదించింది.

ఫోక్స్‌వ్యాగన్‌తో పాటు దాని అనుబంధ సంస్థలు ఆడి, పోర్షే బ్రాండ్‌ల సిబ్బంది, ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ స్థానాలు కూడా ఈ ఉద్యోగాల కోత పరిధిలోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉద్యోగాల తొలగింపునకు సంబంధించిన తుది గడువును యాజమాన్యం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు గానీ.. ఈ ఏడాది చివర్లో ఈ కోతలు ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ నిర్ణయం వెనుక ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న ఊహించని ఆర్థిక ఒడిదొడుకులు, మిగులు ఉత్పత్తి ప్రధాన కారణాలని చెబుతున్నారు.
అంతర్జాతీయ ఆటోమొబైల్ మార్కెట్ పరిస్థితుల వల్ల ఐరోపాలో ఫోక్స్‌వ్యాగన్ సామర్థ్యానికి మించి ఏటా అయిదు లక్షల వాహనాలు అదనంగా తయారవుతున్నాయి. ఈ మిగులు ఉత్పత్తి సమస్యను పరిష్కరించడానికి జర్మనీలోని నాలుగు ప్రధాన తయారీ కేంద్రాల భవిష్యత్తును పునఃసమీక్షించనున్నారు. ఎమ్డెన్, జ్విక్కౌ, హానోవర్, నెకర్‌సల్మ్ ప్లాంట్లలో సాధారణ కార్ల తయారీకి బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పునర్వినియోగ మార్గాలను అన్వేషించాలని భావిస్తోంది.
మందగించిన కార్ల అమ్మకాల నేపథ్యంలో ఐరోపా ప్లాంట్ల కోసం 2027 జూన్ నాటికి వీటికి బదులుగా ఇతరత్రా వాటిని ఉత్పత్తి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయనుందా సంస్థ. ఫోక్స్‌వ్యాగన్ 2024 డిసెంబర్‌లో జర్మనీ ప్లాంట్లలో దాదాపు 35,000 పోస్టుల తొలగింపు, వార్షిక వ్యయాలను నాలుగు బిలియన్ యూరోల మేర తగ్గించుకోవడానికి ఉద్యోగుల ప్రతినిధులతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడితో దీనికి బ్రేకులు పడట్లేదు. ఆర్థిక సవాళ్లు ఉధృతం కావడంతో యాజమాన్యం మరిన్ని కఠిన నిర్ణయాలకు సిద్ధమైంది.
అమెరికా, చైనా వంటి దిగ్గజ ఆటోమొబైల్ మార్కెట్లల్లో కూడా ఫోక్స్‌వ్యాగన్ తన వ్యూహాలను పూర్తిగా మార్చుకుంటోంది. ఈ రెండు దేశాలతో పాటు యూరప్.. ఫోక్స్ వ్యాగన్ కు అతిపెద్ద మార్కెట్లు. అమెరికాలో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టే వాహన విభాగాలపైనే దృష్టి కేంద్రీకరించనుంది. చైనాలో మందగించిన వృద్ధికి అనుగుణంగా తమ ఉత్పత్తి కార్యకలాపాలలో వీలైనన్ని మార్పులు చేసుకుంటోంది.
వోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఆర్థిక పరిస్థితి ఇటీవలి కాలంలో బాగా బలహీనపడింది. 2026 మొదటి అర్ధభాగంలో కంపెనీ నికర లాభం 31 శాతం తగ్గి 3.1 బిలియన్ యూరోలకు పరిమితమైంది. అమెరికా విధించిన కఠిన టారిఫ్, తమ ఐడీ.4 ఉత్పత్తి నిలిపివేత కారణంగా వచ్చిన అదనపు ఖర్చులు కంపెనీ బ్యాలెన్స్ షీట్‌ను బాగా దెబ్బతీశాయి. ఇది కాకుండా చైనాలో స్థానిక తయారీదారుల ద్వారా తీవ్రమైన పోటీ నెలకుంది. సంస్థ నిర్వహణ వ్యయం ప్రస్తుతం ఆటోమొబైల్ పోటీదారుల కంటే దాదాపు 20 శాతం ఎక్కువగా ఉందని చెబుతోంది బోర్డు.












Click it and Unblock the Notifications