బీసీ మహిళా మంత్రిగా అణచివేతకు గురవుతున్నా: మంత్రి కొండా సురేఖ సంచలన లేఖ
తెలంగాణ మంత్రి కొండా సురేఖ తనపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలకు ముందు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు వివరణాత్మక లేఖ రాశారు. తాజాగా ఆమె ఆ లేఖను బహిర్గతం చేశారు. 2026 ఆగస్టు 23న రాసిన ఈ లేఖలో తాను బీసీ మహిళా మంత్రిగా రాజకీయ అణచివేతకు గురవుతున్నట్లు వివరించారు.
కీలక నిర్ణయాలు సీఎంఓ నుంచి నేరుగా జారీ అవుతున్నాయన్న సురేఖ
వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేగా, అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేస్తున్న ఆమె తనకు 31 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందని, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉందని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తన అధికారాలు క్రమంగా కుదించబడుతున్నాయని ఆమె ఆరోపించారు. తన శాఖలకు సంబంధించిన కీలక నిర్ణయాలు సీఎంఓ నుంచి నేరుగా జారీ అవుతున్నాయన్నారు.

యాదాద్రి టెంపుల్ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుతో పాటు ఈ అంశాల్లో తనకు అవమానం
తనను సంప్రదించకుండా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. యాదాద్రి టెంపుల్ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు వంటి ముఖ్యమైన అంశాల్లో తనకు సమాచారం కూడా ఇవ్వలేదని, సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి నిధులు ఒక్క రోజులోనే రోడ్లు, భవనాల శాఖకు బదిలీ చేశారని వివరించారు. శ్రీ రామనవమి సందర్భంగా ప్రభుత్వ ప్రకటనల్లో తన ఫోటోను తొలగించడం తన గౌరవాన్ని దెబ్బతీసిందని అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి నిధులు, సుమంత్ అంశంపైన సురేఖ ఆందోళన
మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ను తనకు తెలియకుండా తొలగించి, పోలీసులు మంత్రి నివాసానికి వచ్చి అరెస్టు చేయడానికి ప్రయత్నించారని, ఇప్పుడు అతనిపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఆలస్యం అవుతున్నాయని, స్మార్ట్ సిటీ, మోడల్ బస్ స్టాండ్, బొంధి వాగు విస్తరణ వంటి పనులు నిలిచిపోయాయని తెలిపారు.
కడియం శ్రీహరి వ్యవహారంలో చర్యలేవి, సీఎం టికెట్ ప్రకటనపైన ప్రశ్న
ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించినా తనకు సమాచారం ఇవ్వలేదని, అభ్యంతరం తెలిపినా చర్యలు లేవని ఆరోపించారు. జగ్గా రెడ్డి విషయంలో అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని సీఎం చెప్పి, పరకాలలో రేవూరి ప్రకాశ్ రెడ్డికి భారీ మెజారిటీ ఇవ్వాలని బహిరంగంగా పిలుపునివ్వడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు.
బీసీ నాయకత్వంపై అణచివేత కొనసాగుతోంది
బీసీ నాయకత్వంపై అణచివేత జరుగుతోందని, తన కుటుంబాన్ని వరంగల్ జిల్లాలో రాజకీయంగా ఒంటరిచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కుమార్తె సుస్మిత పటేల్ వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేస్తూ షోకాజ్ నోటీసు ఇవ్వడం సరికాదని, ఇతర నేతల వ్యాఖ్యలపై అలాంటి చర్యలు లేవని ఆమె ప్రశ్నించారు. తనపై, కుటుంబంపై రాజకీయ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
తాను అధిష్టానానికి పంపిన లేఖను రిలీజ్ చేసిన సురేఖ
తన 31 సంవత్సరాల కాంగ్రెస్ సేవను దృష్టిలో ఉంచుకుని న్యాయం జరిగేలా విచారణ జరపాలని ఖర్గేను కోరారు. లేఖతో పాటు సంబంధిత వీడియోలు, ఆధారాలు ఉన్న పెన్ డ్రైవ్‌ను కూడా జత చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీపై తన విశ్వాసం చెరగలేదని స్పష్టం చేశారు. ఈ లేఖ ద్వారా అన్ని పరిణామాలను వివరించినా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు అధిష్టానం తలొగ్గింది అని కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. తాను అధిష్టానానికి పంపిన లేఖను రిలీజ్ చేశారు.












Click it and Unblock the Notifications