యాదాద్రిలో కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు: వైభవంగా రామలింగేశ్వరస్వామి మహా కుంభాభిషేకం
భువనగిరి: యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్థిని రామలింగేశ్వర స్వామి ఆలయం ఉద్ఘాటన మహాక్రతువును వైభవంగా నిర్వహించారు. ఈ క్రతువులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయ ఉద్ఘాటనకు ఐదు రోజులుగా ఆగమశాస్త్ర రీత్యా మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు.

మహా పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం పూజల్లో కేసీఆర్ దంపతులు
మహా పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం పూజల్లో పాల్గొన్నారు కేసీఆర్ దంపతులు. అనంతరం కేసీఆర్ దంపతులను అర్చక బృందం ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వర్ణ కలశాల ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్ఘాటన పర్వాలు పూర్తయిన నేపథ్యంలో పార్వతీ పరమేశ్వరుల నిజరూపాల దర్శనాలకు అవకాశం కల్పించనున్నారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా ఉద్ఘాటన క్రతువును నిర్వహించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ , ఇతర అధికారులు ఉన్నారు.

రోడ్డు మార్గం ద్వారానే యాదాద్రికి కేసీఆర్ దంపతులు
సోమవారం ఉదయం ఎర్రవల్లి నుంచి రోడ్డుమార్గంలో ఆలయానికి చేరుకున్నారు సీఎం కేసీఆర్ దంపతులు. ముందుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం రామలింగేశ్వరస్వామివారి సన్నిధిలో జరిగే మహాకుంభాబిషేక మహోత్సవంలో పాల్గొని నూతనాలయాన్ని పునఃప్రారంభించారు.

రామలింగేశ్వర స్పటికలింగ ప్రతిష్ఠ
సోమవారం ఉదయం 10.25 గంటలను ధనిష్ఠానక్షత్ర సుముహూర్తాన తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి చేతుల మీదుగా సపరివార రామలింగేశ్వర స్పటికలింగ ప్రతిష్ఠ చేశారు. అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ, ప్రతిష్ఠాంగహోమం, అఘోర మంత్రహోమం, దీగ్దేవతాక్షేత్రపాల బలిహరణం, శోభాయాత్ర, కలశప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. శివాలయ మహాకుంభాభిషేకంలో భాగంగా మధ్యాహ్నం మహాపూర్ణాహుతి, అవబృధం, మహాకుంభాభిషేకం నిర్వహించి స్వామివారి అనుగ్రహ భాషణం చేపట్టారు. అనంతరం మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ, ప్రతిష్ఠాయాగ పరిసమాప్తి పలికారు.












Click it and Unblock the Notifications