కరోనా మహమ్మారిని జయించిన సీఎం కేసీఆర్: తాజా పరీక్షల్లో నెగిటివ్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) కరోనా నుంచి కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలో కేసీఆర్‌కు నెగిటివ్ నిర్దారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఏప్రిల్ 19న సీఎం కేసీఆర్ కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది.
ఈ నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు అప్పటి నుంచి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ఏప్రిల్ 21వ తేదీన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో సీటీ స్కాన్ సహా ఇతర పరీక్షలు చేశారు.

సీటీ స్కాన్‌లో ఛాతీలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేనట్లు తేలిందని వైద్యులు వెల్లడించారు. గత వారం నిర్వహించిన యాంటిజెన్ పరీక్షలో నెగిటివ్ వచ్చినా.. ఆ తర్వాత నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో ఖచ్చితమైన ఫలితం రాలేదు. దీంతో తాజాగా, మరోసారి కేసీఆర్‌కు యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా.. నెగిటివ్ వచ్చింది. రక్తపరీక్షల నివేదికలు కూడా సాధారణంగా ఉన్నాయని తేలింది. సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. మంత్రి కేటీఆర్ కూడా కరోనా బారినపడిన విషయం తెలిసిందే.
ఇది ఇలావుండగా, తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 70,961 శాంపిల్స్ ను పరీక్షించగా, కొత్తగా 6,876 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 4,63,361కు పెరిగింది. సోమవారం ఒక్కరోజే కరోనా కాటుకు 59 మంది బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2476కు పెరిగింది. తెలంగాణలో మరణాల రేటు 0.53 శాతంగా ఉంది.
సోమవారం ఒక్కరోజే కొవిడ్ వ్యాధి నుంచి 7,432 మంది కోలుకున్నారు. తద్వారా రికవరీల సంఖ్య 3,81,365కు పెరిగింది. కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 82.30 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో కొంతమంది హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications