కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం-బ్లాక్ ఫంగస్‌పై కీలక ఆదేశాలు-ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదన్న సీఎం కేసీఆర్
తెలంగాణలో కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందించే విధానాన్ని కొనసాగిస్తూనే... కరోనా టెస్టుల సంఖ్యను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అమలుచేయాలన్నారు. కరోనా కట్టడి కోసం దేశంలో మరెక్కడాలేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తూ మెడికల్ కిట్లను అందించే కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోందన్నారు.కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, వాక్సిన్, లాక్ డౌన్ అమలుపై సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే... ప్రాథమిక వైద్య కేంద్రాలకు కరోనా పరీక్షల కోసం వస్తున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టు కిట్ల సంఖ్యను పెంచాలన్నారు.మంగళవారం(మే 25) నుంచి అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పుడున్న కిట్ల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. అవసరమున్న మేరకు మాన్యుఫాక్చరర్స్‌తో మాట్లాడి సప్లై పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో చికిత్స కోసం రాష్ట్రంలో ప్రత్యేక బెడ్ల ఏర్పాటు, మందులను తక్షణమే సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 150,కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో 200 బెడ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం మొత్తం 1500 బెడ్లు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో నిపుణులైన వైద్యులను కూడా నియమించుకోవాలన్నారు. ఆ చికిత్సకు అవసరమైన మందులు,ఇంజెక్షన్లను వెంటనే ఆర్డర్ చేసి తెప్పించుకోవాలన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వానికి కరోనాను మించిన ప్రాధాన్యత లేదని... వైరస్ కట్టడికి ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదని మరోసారి సీఎం స్పష్టం చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని శాఖల ఖర్చు తగ్గుతుందని,కొన్ని శాఖలకు ఖర్చు పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ఖర్చు పెరిగే పోలీస్,వైద్యారోగ్య శాఖలకు బడ్జెట్ పెంచాలని మంత్రి హరీశ్ రావును ఆదేశించారు. కరోనా కట్టడికి ఢిల్లీలో చేపడుతున్న చర్యలను అధ్యయనం చేయాలన్నారు. అవసరమైతే రాష్ట్ర వైద్య బృందం అక్కడికి వెళ్లి పరిశీలించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని పడకలను ఆక్సిజన్ పడకలుగా మార్చాలని ఆదేశించారు.
రాష్ట్రంలో సెకండ్ డోసు వ్యాక్సిన్ సప్లైకి సంబంధించి వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో మాట్లాడాలని ఆదేశించారు.రాష్ట్రంలోని వైద్య కేంద్రాల్లో సిబ్బంది నియామకాలపై అధికారులతో చర్చించారు. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. అది 5శాతం కన్నా తగ్గినప్పుడే విజయం సాధించినట్లు అని అభిప్రాయపడ్డారు.సీఎం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం సెక్రటరీ, సీఎంవో కొవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు కమిషనర్లు అంజనికుమార్, సజ్జనార్, మహేష్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications