సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం-19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు-ఈ నెల 7న ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 19 జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ నెల 7న డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్యాధికారులకు శనివారం(జూన్ 5) ఆదేశాలు జారీ చేశారు. రాను రాను ప్రజలకు వైద్యం అత్యంత ఖరీదుగా మారిపోయిందని... పేదలకు జబ్బు చేస్తే నయం చేయించుకోవాలని ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని ఈ సందర్భంగా కేసీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో శనివారం(జూన్ 5) వైద్యాధికారులతో సీఎ: సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఏయే జిల్లా కేంద్రాల్లో....
రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు,మహబూబాబాద్,భద్రాద్రి కొత్తగూడెం,జగిత్యాల,సిద్దిపేట,నల్గొండ,ఖమ్మం,రాజన్న సిరిసిల్ల,వికారాబాద్,నిర్మల్,కరీంనగర్,ఆదిలాబాద్,ఆసిఫాబాద్,జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే అధికారులకు ఆదేశాలివ్వడంతో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లలో మొత్తం 57 టెస్టులు ఉచితంగా చేయనున్నారు.

మెరుగైన వైద్య సేవలే లక్ష్యం...: కేసీఆర్
ప్రజలకు అన్ని రకాల మెడికల్,డయాగ్నోస్టిక్ టెస్టులు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే అక్కడ టెస్టులు చేసే సదుపాయం లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్‌కు వెళ్లి దోపిడీకి గురవాల్సి వస్తోందన్నారు.తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం, అన్నిరకాల వైద్య సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే చాలావరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు,మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని చెప్పారు.
Recommended Video

రాష్ట్ర వైద్య చరిత్రలో గొప్ప సందర్భం : కేసీఆర్
వైద్యంలో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షా (డయాగ్నోస్టిక్) కేంద్రాలను తెలంగాణలోని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తుండటం రాష్ట్ర వైద్య చరిత్రలో గొప్ప సందర్భమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆరోగ్య తెలంగాణ దిశగా ఇదో కీలక ముందడుగు అన్నారు.కొద్దిరోజుల క్రితమే రాష్ట్రంలో ఏడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వీటికి అనుబంధంగా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను కూడా మంజూరు చేసింది. కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఎక్కడికక్కడ మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications