రేపు హస్తినకు సీఎం కేసీఆర్... మోదీతో భేటీ... పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన...?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం(డిసెంబర్ 11) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు సాగే ఢిల్లీ పర్యటనలో.. సీఎం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే ప్రధాని అపాయింట్‌మెంట్ కోరింది. నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్రమంత్రులతోనూ సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను మంజూరు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది.
ఇదే పర్యటనలో సీఎం కేసీఆర్ ఢిల్లీలో పార్టీ ఆఫీస్ కోసం కేంద్రం కేటాయించిన స్థలాన్ని పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యాలయ శంకుస్థాపన కోసం ఢిల్లీకి వెళ్లాలని కేసీఆర్ కొంత కాలంగా అనుకుంటున్నా.. వేర్వేరు కారణాలతో పర్యటన వాయిదా పడుతూ వచ్చింది. సీఎం తాజా ఢిల్లీ పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్ ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

రాష్ట్రంలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయం సాగుతున్న వేళ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకవేళ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తే... త్వరలోనే జాతీయ రాజకీయాల దిశగా అడుగులకు అది సంకేతమని భావించవచ్చు.
కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం(డిసెంబర్ 10) సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దుద్దెడలో నిర్మించనున్న ఐటీ టవర్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే ఎన్సాన్‌పల్లి గ్రామ శివారులో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనాన్ని ప్రారంభించారు. అక్కడ వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం సిద్దిపేట శివారులోని నర్సాపూర్‌లో నిర్మించిన 2460 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో లబ్దిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు.












Click it and Unblock the Notifications