ఇంతకుమించి ఏముంటుంది: రేవంత్ రెడ్డి భావోద్వేగపూరిత వ్యాఖ్యలు
హైదరాబాద్: తాము అధికారంలోకి రాగానే ప్రగతి భవన్.. ప్రజా భవన్‌గా మారుతుందని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే పనిచేశారు. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా మార్పునకు శ్రీకారం చుట్టారు. ప్రగతిభవన్‌ను నేటి నుంచే జ్యోతిబాపూలే ప్రజాభవన్‌గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ప్రమాణ స్వీకారోత్సవంలో చెప్పినట్లుగానే ప్రజాభవన్‌లో శుక్రవారం ప్రజా దర్బర్ (Praja Darbar) నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుతో వినతులతో ప్రజాభవన్‌కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు ప్రజలు. వారి సమస్యలను సీఎం రేవంత్ సావధానంగా అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.

గంట సేపు ప్రజల నుంచి విజ్ఞాపనలను స్వీకరించిన సీఎం విద్యుత్‌శాఖపై అధికారులతో సమీక్ష ఉన్నందున ఆ బాధ్యతలను మరో మంత్రి సీతక్కకు అప్పగించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓపిగ్గా విని పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. కాగా, మొదటి రోజు ప్రజాదర్బార్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించారు రేవంత్‌రెడ్డి.
'జనం కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజా దర్బార్ సాగిందని వివరించారు. జనం నుంచి ఎదిగి ఆ జనం గుండె చప్పుడు విని వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించిన తృప్తి ఏముంటుంది' అని రేవంత్ రెడ్డి భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎక్కువగా ఇళ్లు, పింఛన్లు, భూ సంబంధిత సమస్యలు, ఒప్పంద కార్మికుల జీతాల పెంపు సహా వివిధ రకాల వినతులు సీఎం వద్దకు వచ్చాయి. ప్రజా దర్బార్ కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన అధికారులు అర్జీలను నమోదు చేసి తక్షణ పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు.
మరోవైపు, తమ సమస్యలను ముఖ్యమంత్రి స్వయంగా వినడంతో అక్కడికి వచ్చిన ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. సీఎంకు తమ సమస్యలపై వినతులు అందజేసిన వివిధ వర్గాల ప్రజలు ఇప్పటికైనా తమ సమస్య పరిష్కారమవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించడం శుభపరిణామమని అన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం ధీమాగా ఉందన్నారు.
జనం కష్టాలు వింటూ…
— Revanth Reddy (@revanth_anumula) December 8, 2023
కన్నీళ్లు తుడుస్తూ
తొలి ప్రజా దర్బార్ సాగింది.
జనం నుండి ఎదిగి…
ఆ జనం గుండె చప్పుడు విని…
వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించి తృప్తి ఏముంటుంది!#TelanganaPrajaPrabhutwam pic.twitter.com/E71r3lYlur
కాగా, ప్రజా దర్భార్‌లో మొదటగా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని వినతులను స్వీకరించారు. ప్రజాదర్బార్ వేదికకు వివిధ సమస్యలపై విన్నవించటానికి పెద్దఎత్తున వచ్చిన ప్రజల విజ్ఞాపనలు ముఖ్యమంత్రి స్వీకరించి, వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క ఉన్నారు.












Click it and Unblock the Notifications