టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు: సభ్యుల వరుస రాజీనామాలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుసగా అన్ని కీలక అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రక్షాళనపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో మంగళవారం టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షా పత్రాల లీకేజీ అంశానికి సంబంధించిన వివరాలు, కేసు పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, పోలీసు ఉన్నతాధికారులు, కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు, కమిషన్ ఛైర్మన్ సహా సభ్యుల నియామకానికి సంబంధించిన అర్హతలు, ఇతర అంశాలపై రేవంత్ ఆరా తీశారు. కమిషన్ ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలు, మిగిలిన సభ్యుల నియామకాల ప్రస్తుత స్థితి, పరీక్షల నిర్వహణ, సంబంధిత అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గ్రూప్1, ఏఈఈ తదితర పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సీఎం అడిగి తెలుసుకున్నారు.

కేసు పురోగతి, ఇప్పటి వరకు జరిగిన విచారణ, తదుపరి కార్యాచరణ సహా అన్ని అంశాల గురించి పోలీసు ఉన్నతాధికారుల ద్వారా వివరాలు తీసుకున్నారు. ఇతర పరీక్షల తేదీలు, నిర్వహణ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పరిస్థితులకు అనుగుణంగా కమిషన్ తగిన నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలంటూ రేవంత్
టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యూపీఎస్సీ విధానంపై, ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లపై సమగ్ర అధ్యయనం చేసి.. నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకాలు పారదర్శకంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కమిషన్ ఏర్పాటు ఉండాలన్నారు. పది, ఇంటర్ పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీల పనితీరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అంతేగాక, రాష్ట్రంలో ఎక్కడ జూనియర్ కాలేజీలు అవసరమో నివేదిక ఇవ్వాలని సూచించారు.
టీఎస్‌పీఎస్సీ సభ్యుల రాజీనామా
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేయగా.. తాజాగా, కమిషన్‌లోని ఐదుగురు సభ్యులు రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ ప్రక్షాళన చేపట్టిన నేపథ్యంలో వరుస రాజీనామాలు చోటు చేసుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications