బటన్ నొక్కి నిధులు జమ.. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నగదు
తెలంగాణలోని రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతులు తమ ఫోన్లు చెక్ చేసుకోవాలని సూచనలు చేశారు. జూన్ 17 నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. మంత్రులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని రైతుల కోసం ఇప్పటివరకు లక్ష కోట్లు ఖర్చుచేసామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తెలంగాణలోని రైతుల కోసం ఇప్పటివరకు లక్ష కోట్లు ఖర్చుచేసామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూన్ 17 నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. మంత్రులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎకరాల వారీగా కాకుండా అర్హులైన వారందరికీ ఒకేసారి రైతు భరోసా ఇస్తామని తెలిపారు. కోటి 49 లక్షల 35 వేల ఎకరాలకు రైతు భరోసా నిధులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. రైతు భరోసాలో ఎలాంటి పరిమితి లేకుండా అర్హులైన ప్రతిరైతుకు రైతు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. 9 రోజుల్లోనే అందరికీ రైతు భరోసా పూర్తి చేస్తామని తెలిపారు.
పదేళ్ల పాలనలో నెత్తిమీద అప్పు.. చేతిలో చిప్ప
"రైతు ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్లమెంటుకు వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా రైతులు అండగా ఉంటేనే సాధ్యం. గతంలో పదవులు అనుభవించినవాళ్లు, పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయనివారు వీధి వీధినా నాటకాలకు బయలుదేరారు. పదేళ్ల పాలనలో నెత్తిమీద అప్పు.. చేతిలో చిప్ప పెట్టారు. వాళ్లు పదేళ్లలో చేసిన విధ్వంసం వందేళ్లయినా కోలుకోలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్ధిక వ్యవస్థగా మార్చి మనకు అప్పగించారు. అద్దాల మేడలు కట్టి, రంగుల గోడలు చూపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు రుణమాఫీ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారు. వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. వరి వేయండి చివరి గింజ వరకు కొనే బాధ్యత మాది అని చెప్పిన ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం" అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా
"పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు రైతులను సన్న వడ్లు పండించేందుకు ప్రోత్సహించాం. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించి రాష్ట్రంలో 60 శాతం సన్న వడ్లు పండించేలా ప్రోత్సహించాం. మీరు సన్న వడ్లు పండించడం వల్లే ఇవాళ పేదలకు సన్నంబియ్యం అందించగలుగుతున్నాం. వరి పండించడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలి. పదేళ్లలో 8లక్షల 20 వేల కోట్ల అప్పు మా నెత్తిపై మోపి నడుం వంగిపోయే పరిస్థితి తెచ్చారు. అప్పులు మన నెత్తిపై పెట్టి ఇవాళ మనల్ని విమర్శలు చేస్తున్నారు. ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించేందుకు ఇక్కడికి వచ్చాం. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
భార్యాభర్తలు మాట్లాడుకున్నా ఫోన్ ట్యాపింగ్..
"18 నెలల్లోనే రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. ఏ గ్రామంలోనైనా సవాల్ విసురుదాం.. గ్రామ సభలు పెడదాం, గ్రామాల్లో చర్చ పెడదాం. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి ఆత్మ గౌరవంతో బ్రతికే పరిస్థితి కల్పించాం. చావుల పునాదులపై అధికారంలోకి రావాలని దురాలోచనతో ప్రతిపక్షం ప్రయత్నిస్తుంది. కొంత కాలమైనా సమయం ఇవ్వరా.. ? సరిదిద్దుకొనివ్వరా..? భార్యాభర్తలు మాట్లాడుకున్నా ఫోన్ ట్యాపింగ్ చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను కల్పించాం. ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. మీ భవిష్యత్ బాగుంటేనే మాకు ఆనందం. ఆ దిశగా మిమ్మల్ని తీర్చిదిద్దడమే మా కర్తవ్యం. రైతులకు సోలార్ పంపుసెట్లతో ప్రయోజనం, వాణిజ్య పంటలు, ఇతర పంటలపై కలెక్టర్లు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఈ వేదికగా ఆదేశిస్తున్నా" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

పదేళ్లు మన ప్రభుత్వమే..
రైతులు పంట మార్పిడి చేయండి. భూమి రైతుకు ఆత్మగౌరవం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేళ్లు మన ప్రభుత్వమే ఉంటుంది రాష్ట్రాన్ని బొందల గడ్డగా మార్చిన వాళ్లు సిగ్గులేకుండా మనల్ని విమర్శిస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
రైతునేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయని.. అన్నదాతలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పలువురు ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications