బాహుబలి బలంతో కాంగ్రెస్ క్యాడర్.. సర్చంచ్ ఎన్నికలకు సై..!
తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల జోష్ కనిపిస్తోంది. సమర్థవంతమైన నాయకత్వానికి బాధ్యతలు అప్పగించి క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయానికి ఆ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లో వైస్-ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, జిల్లా ఇన్‌చార్జ్‌ల నియామకాలతో పార్టీలో కొత్త ఊపు సంతరించుకుంది. ఈ నియామకాలు కేవలం పదవుల భర్తీ కోసం మాత్రమే కాకుండా, పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన నాయకులకు గుర్తింపు ఇవ్వడం, సామాజిక న్యాయాన్ని పార్టీ పదవుల్లో అమలు చేసి చూపడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి జరిగినట్టు టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి.
టీపీసీసీలో కొత్త ఆరంభం
గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, లోక్‌సభ ఎన్నికల్లో గణనీయంగా సీట్లు పెంచుకున్న కాంగ్రెస్ తదుపరి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిచేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృషిసారించింది. అందులో భాగంగా ముందుగా టీపీసీసీ కొత్త కార్యవర్గ కూర్పును ప్రకటించింది. 27 మంది వైస్-ప్రెసిడెంట్లు, 69 మంది జనరల్ సెక్రటరీలతో జంబో కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. ఈ నియామకాల్లో సామాజిక న్యాయం ఒక కీలక అంశంగా ఉంది. 70 శాతం మందిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నుంచి ఎంపిక చేసింది. పార్టీలో సీనియర్లతోపాటు యువకులకు కూడా అందలమెక్కించింది. మరోవైపు జూలై 7న ఉమ్మడి జిల్లాల వారీగా 10 మంది నేతలను ఇంచార్జ్‌లుగా నియమించారు. స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు, రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీని సమర్థవంతంగా నడిపించే బాధ్యతను పార్టీ వీరికి అప్పగించింది.
సామాజిక న్యాయ సమరభేరి కీలక పరిణామం:
ఇక ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా పీఏసీ, టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశాల్లో పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి, పదవుల భర్తీపై కీలక ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జ్‌ల నియామకం జరిగినట్టు తెలుస్తోంది. ఇక గ్రామ స్థాయి అధ్యక్షులతో జరిగిన సామాజిక న్యాయ సమరభేరి కాంగ్రెస్‌లో కొత్త జోష్ నింపినట్టు తెలుస్తోంది.
గతంలో ఎన్నడ లేని విధంగా గ్రామ స్థాయి అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి అని, పార్టీ క్షేత్ర స్థాయి నాయకత్వానికి అధినాయకత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదే నిదర్శనమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసిన వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించే బాధ్యత తనదే అని ముఖ్యమంత్రి రేవంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన క్యాడర్‌లో ఫుల్ జోష్ నింపింది. జూలై 4న జరిగిన సామాజిక న్యాయ సమరభేరి తెలంగాణ కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులకు కీలక పరిణామంగా నేతలు అభివర్ణిస్తున్నారు.
పాజిటివ్ మూడ్ లో కాంగ్రెస్ క్యాడర్
ఇప్పటికే కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలతో దేశవ్యాప్త చర్చను లేవనెత్తడం ద్వారా కాంగ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అంశాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేస్తాయని ఆశాభావంగా ఉంది. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు పెంచిన రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలనే కృతనిశ్చయం కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి తోడుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీని ప్రజలకు మరింత చేరువ చేస్తాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

ముఖ్యంగా సన్నబియ్యం పథకం గేమ్ ఛేంజర్‌గా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఖర్గే కూడా ఇదే అంశాన్ని లేవనెత్తాని గుర్తు చేస్తున్నారు. ఇక ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, సన్నబియ్యం, రూ.500కే గ్యాస్ వంటి హామీలకు గ్రామీణా ప్రాంతాల్లో ప్రజల ఆమోదం ఉండడం తమకు అనుకూలాంశం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక జూలై 14న 2.89 లక్షల మందికి కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాల అమలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు తిరుగులేని విజయాన్ని అందిస్తాయని కాంగ్రెస్ నేతలు ఆశాభావంగా ఉన్నట్టు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications