తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదం ఇదే
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల కోసం సరికొత్త నినాదాన్ని ఎంచుకుంది. 'తిరగబడదాం.. తరిమికొడదాం' అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పార్టీ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు.
బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాకోర్టు కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ తోపాటు ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ సెక్రటరీలు, వర్కింగ్ ప్రెసిడెంట్‌లు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నెల రోజులపాటు గ్రామ గ్రామాన బీఆర్ఎస్ వైఫల్యాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ ఛార్జీషీట్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. 12వేల గ్రామాల్లో, 3వేల డివిజన్లలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు వెళ్లి 75 లక్షల కుటుంబాలను కాంగ్రెస్ శ్రేణులు కలుస్తారన్నారు.
కేటీఆర్‌కు వాదికి వ్యాధికి తేడా తెలియదని మండిపడ్డారు. తెలంగాణ నష్టపోవడానికి మొదటి ముద్దాయి కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ మోసం చేసిందని కేసీఆర్ అంటున్నారని.. ఆ రెండు పార్టీల్లోనూ కేసీఆర్ ఉన్నారని రేవంత్ గుర్తు చేశారు. తెలంగాణ పదమే ఇష్టం లేక పార్టీ పేరు మార్చిన వ్యక్తి కేసీఆర్ అని రేవంత్ దుయ్యబట్టారు. తెలంగాణ వాదానికి కేసీఆర్‌కు సంబంధం లేదన్నారు.
రాష్ట్రస్థాయిలో పొత్తులపై ఎలాంటి చర్చలు లేవని.. ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఏఐసీసీ ఏమి చెబుతుందో చూడాలని రేవంత్ అన్నారు. కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఏంటో బండి సంజయ్‌ను అడిగితే బాగా చెబుతారన్నారు.
కాంగ్రెస్ మెనిఫెస్టో ప్రకటన వరకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు.. మెనిఫెస్టో ప్రకటన తర్వాత కాంగ్రెస్ విధానాలపై విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ మెనిఫెస్టోను సోనియా గాంధీ చేతుల మీదుగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ నిర్వహించే సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే పాల్గొననున్నారు. ప్రజాకోర్టు తెలంగాణ కాంగ్రెస్ విధానమని.. ఇందులోనే నరేంద్ర మోడీ, కేసీఆర్ లను నిలబెడతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications