తెలంగాణ డీఎస్సీ వాయిదా
హైదరాబాద్: తెలంగాణలో మరో పరీక్ష వాయిదా పడింది. తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (DSC) వాయిదా పడింది. నవంబర్ నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం ప్రకటించింది. మొత్తం 5089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబర్ 20 నుంచి 30 వరకు టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు.
అయితే, నవంబర్ 30న ఎన్నికలు జరగనుండటంతో టీఆర్టీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల కారణంగానే ఇటీవల తెలంగాణ గ్రూప్-2 పరీక్షలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.
తెలంగాణ గ్రూప్-2 మరోసారి వాయిదా, కొత్త తేదీలివే

ముందుగా నిర్ణయించిన ప్రకారం నవంబర్ 2, 3న గ్రూప్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను రీషెడ్యూల్ చేశారు. గ్రూప్-2 పరీక్షను వచ్చే ఏడాది(2024) జనవరి 6,7 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఓ ప్రకటనలో వెల్లడించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో గ్రూప్-2 పరీక్ష వాయిదా, కొత్త తేదీల ఖరారుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
మొదట విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉన్నప్పటికీ.. అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలకు దిగారు. దీంతో ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. అప్పుడు నవంబర్ 2,3 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అయితే, తాజాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పరీక్ష నిర్వహణ క్లిష్టతరమయ్యే అవకాశం ఉండటంతో మరోసారి వాయిదా వేయాలని నిర్ణయించారు అధికారులు. దీంతో గ్రూప్-2 అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వచ్చే ఏడాది జనవరి 6,7 వరకు ఎదురుచూడక తప్పదు. అయితే, పరీక్షకు చాలా సమయం ఉండటంతో అభ్యర్థులు పరీక్షకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేందుకు సమయం దొరుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications