కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇంట్లో సోదాలు: బీఆర్ఎస్ నేత ఇంట్లోనూ
నిజామాబాద్: మరికొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో పోలీసుల తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం అధికారులు కూడా ప్రలోభాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయ పార్టీల నేతల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు పట్టు పడుతుండటం గమనార్హం. ఇక ఫిర్యాదులు వచ్చిన రాజకీయ నేతల నివాసాల్లోనూ పోలీసులు, ఎన్నికల అధికారులు సోదాలు చేపడుతున్నారు. తాజాగా, బుధవారం మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ నివాసంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది. స్థానికేతరులు కొందరు షబ్బీర్ అలీ ఇంట్లో ఉన్నారని సమాచారంతో తనిఖీలు చేపట్టారు.

షబ్బీర్ అలీ ఇంట్లో కర్ణాటక ఎమ్మెల్యే ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి, కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
బీఆర్ఎస్ నేత ఇంట్లో ఎన్నికల అధికారుల సోదాలు జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతల ఇళ్లల్లో ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓటర్లకు పంచేందుకు పెద్ద ఎత్తున నగదు నిల్వ ఉంచారని ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో వెల్గటూర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చల్లూరి రామచందర్ గౌడ్ ఇంట్లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు.
కాగా, రామచందర్ గౌడ్ ఇంట్లో ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడి చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 144 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications