తెలంగాణాలో మొదలైన ఎన్నికల పోలింగ్.. ఓటర్ల చేతిలో నేతల తలరాతలు!!
తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ మొదలైంది .119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 3.26 కోట్లమంది నేడు అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును తేల్చనున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓట్ల పండుగను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2290 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో, ఎవరికి పట్టం కట్టాలి అనే నిర్ణయాధికారం మహిళల చేతుల్లోనే ఉందని తెలుస్తుంది. దాదాపు 75 నియోజకవర్గాలలో మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే ఎక్కువ సంఖ్యలో ఉండడంతో, ఆయా నియోజకవర్గాలలో మహిళా ఓటర్లు ఎవరికి పట్టం కడతారు అన్నది ఆసక్తిగా మారింది.

బుధవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది, పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పూర్తి చేసి, మాక్ పోలింగ్ నిర్వహించి, పోలింగ్ మొదలుపెట్టారు. ఈరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అయితే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఎన్నికల అధికారులు సమస్యాత్మక ప్రాంతాలలో నాలుగు గంటలకే పోలింగ్ ముగించనున్నారు.
అయితే అప్పటికే క్యూ లైన్లో ఉన్నవారికి అవకాశాన్ని కల్పిస్తారు. భారీ భద్రత నడుమ పోలింగ్ ప్రక్రియలో రెండు లక్షలకు మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్ నిర్వహణకు సుమారు 75 వేల మంది పోలీసు బలగాలు, రాష్ట్రంలోని 40 వేల మంది, సరిహద్దు రాష్ట్రాల నుంచి 15 వేల మంది, 375 కంపెనీల కేంద్ర సాయుధ బలగాల మోహరింపు జరిగింది.
తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేకమైన బందోబస్తును ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో 12,311 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోని 35,655 పోలింగ్ కేంద్రాలకు గాను 27 వేల 51 చోట్ల ఓటింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
మొత్తం ఎన్నికల పర్యవేక్షణకు 3800 మంది సెక్టార్ ఆఫీసర్లను, 22 వేల మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. మొత్తంగా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారులు ప్రస్తుతం పోలింగ్ కొనసాగిస్తున్నారు. ఓటర్ దేవుళ్ళు తమ తీర్పును ఈవీఎంలలో భద్రపరుస్తున్నారు.












Click it and Unblock the Notifications