సీఎం అభ్యర్థిపై తేల్చేసిన వీహెచ్
V Hanumantha Rao: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఇక ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది. నేడు తమ నాయకుడిని ఎన్నుకోనుంది కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP meeting). హైదరాబాద్ గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో ఈ భేటీ ఏర్పాటైంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు ఠాకూర్, పీసీసీ అధినేత, ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, కొత్తగా గెలిచిన శాసన సభ్యులతో పాటు పలువురు సీనియర్ నేతలు, పరిశీలకులు దీనికి హాజరయ్యారు. సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది.

పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పుడే తెలియదని, సీఎల్పీ సమావేశంలోనే అది తేలుతుందని అన్నారు.
పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చిన ఎన్నికల పరిశీలకులు.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చాల్సింది అధిష్ఠానమేనని, ఆ సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోందని వీహెచ్ గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి సీటు కోసం సీనియర్ నేతలు పోటీ పడటం సహజమేనంటూ ఓ ప్రశ్నకు బదులిచ్చారు వీహెచ్. పీసీసీ అధ్యక్షుడిగా ఈ ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)కే ముఖ్యమంత్రి పదవి లభించే అవకాశం ఉందని వీ హనుమంతరావు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications