బడితె ఉన్న వాడిదే బర్రె: తెలంగాణ ఓటర్లకు లోక్‌సత్తా జేపీ విజ్ఞప్తి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది.
పోలింగ్‌ను సజావుగా కొనసాగించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఓటర్లు అధికారాన్ని ఎవరికి కట్టబెట్టారనేది తేలిది అప్పుడే.

ఈ పరిస్థితుల్లో లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ ఓ వీడియో విడుదల చేశారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఒకరి మీద కోపంతోనో.. కసితోనో లేక డబ్బుల మీద ప్రలోభంతోనో ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు.
ఓటు అనేది తమ భవిష్యత్తును తీర్చిదిద్దేదని, రేపు ఏం జరుగుతుందనేది ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అన్ని పార్టీలు కూడా డబ్బులను ఇచ్చి ఓట్లను కొంటోన్నాయని, బడితె ఉన్న వాడిదే బర్రె అనే పరిస్థితి రాజకీయాల్లో నెలకొని ఉందని జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు.

అవినీతి, అధికార దుర్వినియోగం అన్ని చోట్లా ఉందని, అధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటోన్నారని జేపీ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఓటు వేయాలనేది విజ్ఞతతో నిర్ణయించుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పన, ఆదాయం పెంపు.. ఇలా అభివృద్ధికి ఎవరు దోహం చేస్తున్నారనేది తేల్చుకోవాలని అన్నారు.
డబ్బంతా తాత్కాలిక అవసరాల కోసం ఖర్చు చేసే వారు రాష్ట్ర భవిష్యత్తుకు ఖచ్చితంగా ప్రమాదకారిగా మారుతారని జయప్రకాష్ నారాయణ అన్నారు. ఎవరి వల్ల తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి?, పెట్టుబడులు లభిస్తాయి?, ఆర్థిక ప్రగతి చేకూరుతుంది? అనే అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు. యువ ఓటర్లు ఈ అంశాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని కోరారు.

అధికారంలో ఎవరు వచ్చినా.. వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత కూడా ఓటర్ల మీదే ఉందని జేపీ చెప్పారు. ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పన.. అంశాలపైనే ప్రభుత్వం పని చేసేలా దిశానిర్దేశం చేయాలని సూచించారు. డబ్బులు పంచడం, తాత్కాలిక తాయిలాలను ఇవ్వడం వల్ల ఇది సాధ్యపడదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications