నన్ను ఓడించడానికి ఆ మూడు శక్తులు ప్రయత్నించాయి: రాజా సింగ్ సంచలనం
T Raja Singh: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవి చూసిన భారత్ రాష్ట్ర సమితి (BRS)కు మరో షాక్ తగిలింది. కొందరు కొత్త ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ పార్టీకి జైకొట్టనున్నారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. పోటీ చేసిన 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు 38 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగారు. 66 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్ ప్రభంజనం ముందు ఆరుమంది మంత్రులు సైతం మట్టికరిచారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గోషా మహల్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే టీ రాజా సింగ్ ఘన విజయం సాధించారు. ఆయన గెలవడం వరుసగా ఇది మూడోసారి. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆయన ఒక్కరే గెలిచారు. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్, దుబ్బాక బరిలో నిలిచిన రఘునందన్ రావు.. తమ సమీప ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోయారు.
ఈ ఎన్నికల్లో మొత్తంగా బీజేపీకి చెందిన ఎనిమిది మంది అభ్యర్థులు విజయఢంకా మోగించారు. 2014 తరువాత ఈ స్థాయిలో అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకోగలగడం బీజేపీకి ఇదే తొలిసారి. కామారెడ్డి నుంచి గెలిచిన వెంకటరమణా రెడ్డి.. ఏకంగా కేసీఆర్, రేవంత్ రెడ్డిని సైతం మట్టి కరిపించారు.
తన విజయం తరువాత గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో విజయ యాత్రను చేపట్టారు టీ రాజా సింగ్. గోషా మహల్ ఓటర్లు తనపై నమ్మకంతో మూడోసారి విజయాన్ని కట్టబెట్టారని, ఆ విశ్వాసాన్ని నిలుపుకొంటానని అన్నారు. తొమ్మిది సంవత్సరాలుగా ప్రజలు తన పనితీరును గమనించి, ఆదరించారని అన్నారు.

నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు చేశానని టీ రాజా సింగ్ అన్నారు. తనను ఓడించడానికి అన్ని శక్తులు కలిసి పనిచేసినప్పటికీ.. అది సాధ్యపడలేదని పేర్కొన్నారు. ఏఐఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఉమ్మడిగా కలిశాయని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం, డబ్బు, పోలీసులను సైతం తన ఓటమి కోసం ఉపయోగించారని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లల్లో బీజేపీ గెలుపుపై రాజా సింగ్ మాట్లాడుతూ- భవిష్యత్తులో జరగబోయే లోక్ సభ ఎన్నికల ఫలితాలను ఇది ప్రతిఫలించిందని వ్యాఖ్యానించారు. దేశం మొత్తం ప్రధాని మోదీ నాయకత్వాన్ని కోరుకుంటోందని, మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications