Telangana exit polls 2023: చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం అంత పని చేసిందా?: ఎగ్జిట్ పోల్స్‌పై పోస్ట్‌మార్టమ్
తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ నెల 3వ తేదీన నిర్వహించబోయే ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలు ఎలా ఉండొచ్చనే విషయంపై తమ అంచనాలను వ్యక్తం చేశాయి. ఒకట్రెండు మినహా దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి. భారీ మెజారిటీని అందించాయి.
తెలంగాణపై ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ (India TV-CNX) నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ (Telangana Exit Polls) ఏకంగా 63 నుంచి 79 స్థానాలతో హస్తం పార్టీ జెండా ఎగురవేస్తుందని తేల్చింది. బీఆర్ఎస్- 31 నుంచి 47 స్థానాలకే పరిమితమౌతుందని అభిప్రాయపడింది. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గగనమేనని స్పష్టం చేసింది.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ- ఈ నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా బీఆర్ఎస్ నిజంగా ఓటమి చవిచూడాల్సిన పరిస్థితే ఎదురైతే దానికి ప్రధాన కారణాలేంటీ? అనే విషయంపై అప్పుడే విశ్లేషణలు మొదలయ్యాయి. కాంగ్రెస్ గెలుపునకు ఏఏ అంశాలు దారి తీశాయనే విషయంపై పోస్ట్‌మార్టమ్ షురూ అయ్యాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం.. బీఆర్ఎస్ ఓటమికి దారి తీసిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అయితే బీఆర్ఎస్ ఓడిపోవడమేంటీ?, ఏపీ రాజకీయాలు తెలంగాణను ప్రభావితం చేశాయా? అనే ప్రశ్నలకూ సమాధానాలు ఉన్నాయి.
లక్షలాది మంది ఏపీ ఓటర్లు తెలంగాణలో నివసిస్తోన్నారు. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో వారి సంఖ్య అధికం. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేయగలిగే సంఖ్యలో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై బీఆర్ఎస్‌కు చెందిన కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు వారిలో ఆగ్రహాన్ని కలిగించాయని చెబుతున్నారు. అభిప్రాయం ఉంది.
తెలంగాణ ఓటర్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకత కూడా ఓటమికి దారి తీయొచ్చని అంచనా వేస్తోన్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సెటిలర్లల్లో తీవ్ర అభద్రతభావాన్ని కలిగించాయని, బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పని చేయడానికి వారిని పురిగొల్పిందంటూ ఆరా మస్తాన్ విశ్లేషించారు కూడా.
ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. అలాగని ఏ పార్టీకీ బహిరంగంగా మద్దతూ ప్రకటించలేదు. ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ విజయానికి కృషి చేశారనేది బహిరంగ రహస్యమే. టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకు మొత్తం కాంగ్రెస్ మళ్లిందనీ అంటున్నారు. దీనికి కారణం- గతంలో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పని చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు కావడమే.
రేవంత్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ క్యాడర్‌లో ఉన్న అభిమానం.. వారిని కాంగ్రెస్ వైపు ఓటు వేసేలా చేసిందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో- చంద్రబాబు అరెస్ట్‌పై బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించిన తీరు వారిని మరింత ఆగ్రహానికి గురి చేసిందని విశ్లేషిస్తోన్నారు.












Click it and Unblock the Notifications