రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి కాలం రావడంతో ఉదయం 9 నుంచే ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 42 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో అధికారులు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎండల బీభత్సం అధికంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. నిజామాబాద్, ఆదిలాబాద్, మహబుబ్ నగర్ లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఓ వైపు ఎండలు మరోవైపు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతుందని, బుధవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీనికి ఎల్ నినో పరిస్థితులు కారణమని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇవి నైరుతి రుతుపవనాలపై ప్రభావం చూపుతాయని పేర్కొంది.
ఇక వాతావరణ శాఖ హెచ్చరికలతో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, హైదరాబాద్ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రెండు రోజుల్లో ఎండలు మరింత తీవ్రతరం అవుతాయని హెచ్చరించారు. ప్రజలు అందుకు తగినట్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఖమ్మం తదితర జిల్లాల్లో వడగాల్పులు భారీగా వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అటు ఆంధ్రప్రదేశ్ లోనూ రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు.












Click it and Unblock the Notifications