తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపికబురు: కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
హైదరాబాద్: రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఒప్పంద(కాంట్రాక్ట్) ఉద్యోగుల రెగ్యూలరైజేషన్ ప్రక్రియకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యూలరైజేషన్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది.
80 వేలకుపైగా కొత్త ఉద్యోగాల భర్తీతోపాటు 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ ఆర్థిక శాఖ కసరత్తులు ప్రారంభించింది. అర్హులైన ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలను కోరింది.

2016 ఫిబ్రవరి 26న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. అదే రోజు అందుకు సంబంధించిన మెమో కూడా ఇచ్చింది. అయితే, క్రమబద్ధీకరణపై కొందరు కోర్టుకు వెళ్లడంతో 2017లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెగ్యలరైజేషన్ ప్రక్రియ నిలిచిపోయింది.
కాగా, ఆ పిటిషన్ ను 2021, డిసెంబర్ 7న ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. దీంత ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే తాజాగా, మంజూరైన పోస్టుల్లో రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్లు తెలిపింది ఆర్థిక శాఖ. వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని కోరింది.
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీఎం కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కోరారు. 2016లో జారీ చేసిన 16వ నెంబర్ ఉత్తర్వునకు అనుగుణంగా అర్హులైన వారి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఆర్థిక శాఖ పరిశీలన, ఆమోదం కోసం వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని రామకృష్ణారావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications