ఫించన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఫించన్ పెంపు ఎప్పుడంటే..?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ దూసుకెళ్తోంది. ప్రభుత్వంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకంతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ.. తదితర అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్.
తెలంగాణలోని సంక్షేమ పథకాల్లో అతి ముఖ్యమైనది పింఛన్లు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పేరుతో ఫించన్ల పంపిణీ చేపట్టింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం చేయూత గా మారింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్, బోదకాలు వ్యాధిగ్రస్తులు.. తదితరులకు ఆర్థిక సాయం అందిస్తారు.
చేయూత పథకం కింద వివిధ వర్గాలకు చెందిన వారికి ప్రతి నెలా రూ. 4000 అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా ఫించను పెంపునకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆసరా పెన్షన్‌లను రూ. 4వేలకు, దివ్యాంగుల పెన్షన్లను రూ. 4 వేల నుంచి రూ. 6వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ లోపే పెన్షన్ పెంచి ఆయా వర్గాల వారికి శుభవార్త అందించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. పింఛను పెంపును అమలు చేసి ఎన్నికల్లోకి వెళ్లడమే శుభపరిణామంగా ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఫించను పెంపుపై త్వరలోనే అధికారికంగా రేవంత్ సర్కార్ ఓ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలు నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత బస్సు దగ్గరి నుంచి ఇటీవల ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు పథకం వరకూ రేవంత్ సర్కార్ వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో ఫించన్ల పంపిణీ కూడా వెంటనే చేపట్టాలని స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పెన్షన్ల పెంపు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇక 2024 సామాజిక సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం 42. 7 లక్షల మంది ఫించను లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆసరా పథకం కింద ప్రస్తుతం రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్, బోదకాలు వ్యాధిగ్రస్తులు.. తదితరులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. వృద్ధులతో పాటు ఇతరులకు రూ. 2,016 ఇస్తుండగా.. దివ్యాంగులకు రూ. 4,016 అందిస్తోంది. వీటిని అతి త్వరలోనే పెంచేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications