తెలంగాణ యువతకు గుడ్ న్యూస్- గైడ్ లైన్స్: అర్హతలు ఇవే
Rajiv Yuva Vikasam: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక సహయాన్ని అందించడానికి ఉద్దేశించిన పథకం ఇది.
రాజీవ్ యువ వికాసం..
దీని పేరు- రాజీవ్ యువ వికాసం. వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగులకు స్వయం ఉపాధిని కల్పించడానికి ఈ పథకానికి రూపకల్పన చేసింది రేవంత్ సర్కార్. దీనికింద నిరుద్యోగ యువతకు మూడు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా అయిదు లక్షలమందికి లబ్ది కలుగుతుంది.

ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు..
రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 17వ తేదీన ప్రారంభమైంది. ఆన్‌లైన్ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (OBMMS) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్వయం ఉపాధి కోసం..
ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం 3 లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేయనుంది. ఇందులో 60 శాతం నుంచి 80 శాతం వరకు రాయితీ లభిస్తుంది. దాదాపు 5 లక్షల మందికి 6,000 కోట్ల మేర ఈ రుణాలను అందించనుంది.
లబ్ధిదారుల జాబితా..
పూర్తి వివరాల కోసం https://tgobmms.cgg.gov.in/ ను దర్శించవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 5వ తేదీన ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ 6 నుంచి మే 31వ తేదీ వరకు వాటిని సంబంధిత అధికారులు పరిశీలిస్తారు. వాటిని వడపోస్తారు. అనంతరం లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తారు.
జూన్ 2న రుణ మంజూరు పత్రాలు
ఈ స్కీమ్‌కు ఎంపికైన లబ్దిదారులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2వ తేదీన రుణ మంజూరు పత్రాలు ప్రభుత్వం అందజేస్తుంది. ఈ రుణ పత్రాల మంజూరు కార్యక్రమం 9వ తేదీ వరకు కొనసాగుతుంది. దీనికోసం మండల స్థాయిలో అధికారుల కమిటీని ఏర్పాటు చేయనుంది.
లక్షలమందికి..
ఏ జిల్లాకు సంబంధించిన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ఆ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ కొనసాగుతుంది. లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అయిదు లక్షల మందికి రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తే- ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
జీవో జారీ..
ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. తాజాగా ఈ పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హతలను ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జీవో నంబర్ 7 జారీ చేసింది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఈ జీవోను ఇచ్చారు.
అర్హతలు ఇలా..
ఈ జీవో ప్రకారం- గ్రామణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ. 1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ. 2,00,000 వరకు ఆదాయం ఉన్న వాళ్లు అర్హులు. దరఖాస్తు చేసుకునేటప్పుడే లబ్దిదారులు తమ రేషన్ కార్డు వివరాలను అందులో పొందుపర్చాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేని వాళ్లు మీసేవ కేంద్రాలు జారీ చేసిన ఇన్‌కమ్ సర్టిఫికెట్‌ను జత చేయాల్సి ఉంటుంది.

సడలింపు..
21 నుంచి 55 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న వాళ్లు ఈ పథకం కింద లబ్ది పొందడానికి అర్హులు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు చెందిన వాళ్లకు సడలింపు ఉంది. 60 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
ఒక కుటుంబానికి ఒక్కరే..
ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఇన్‌కమ్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ, పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదార్ పాస్ పుస్తకం, సదరం సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, వల్నరబుల్ గ్రూప్ సర్టిఫికెట్‌ను తమ దరఖాస్తు ఫారానికి జత చేయాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఒక కుటుంబానికి ఒక్కరే లబ్ది పొందడానికి అర్హులు.
జిల్లా స్థాయిలో సెలెక్షన్ కమిటీ..
దరఖాస్తులను జిల్లా స్థాయిలో సెలెక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీకి కలెక్టర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో- అదనపు కలెక్టర్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, ఎస్సీ/బీసీ కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి, దివ్యాంగుల సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ, గిరిజన సంక్షేమ శాఖ డీటీడీఓ, లీడ్ జిల్లా మేనేజర్ సభ్యలు. డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.












Click it and Unblock the Notifications